చారిత్రక కరవాలం తిరిగి భాగ్యనగరానికి..

ABN , First Publish Date - 2022-09-28T15:55:34+05:30 IST

అస్‌ఫజాహీ రాజవంశానికి సంబంధించిన అరుదైన కరవాలం గ్లాస్గో లైఫ్‌ మ్యూజియం నుంచి శతాబ్దకాలం అనంతరం తిరిగి స్వదేశానికి రానుందని సమాచారం

చారిత్రక కరవాలం తిరిగి భాగ్యనగరానికి..

హైదరాబాద్‌ సిటీ: అస్‌ఫజాహీ రాజవంశానికి సంబంధించిన అరుదైన కరవాలం గ్లాస్గో లైఫ్‌ మ్యూజియం నుంచి శతాబ్దకాలం అనంతరం తిరిగి స్వదేశానికి రానుందని సమాచారం. ఇండో-పర్షియన్‌ శైలిలో, పదునైన మొనలు, బంగారు పూతలో దర్శనమిచ్చే పులి, ఏనుగు బొమ్మలతో పాము ఆకారంలో కొలువుదీరిన అరుదైన ఖడ్గం 14వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ కత్తి 1905లో ఆరోనిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కొలువులోని ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్‌ ద్వారా ముంబాయి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ సర్‌ అర్చిబల్డ్‌ హంటర్‌కు చేరిందని చారిత్రక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అయితే, అదెలా చేతులు మారిందనే విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు బ్రిటీష్‌ అధికారులు చోరీ చేశారని అంటుంటే, మరికొందరు హంటర్‌ కొనుగోలు చేశాడని అభిప్రాయపడుతున్నారు.


‘‘బ్రిటీష్‌ అధికారులు దొంగిలించకపోవచ్చు. కులీన కుటుంబానికి చెందిన మహారాజ కిషన్‌ ప్రసాద్‌ ఖడ్డాన్ని విక్రయించకపోవచ్చు. అధ్యయనం ద్వారా వాస్తవాన్ని వెలుగులోకి తేవాలి’’ అని ఇన్‌ట్యాక్‌ కన్వీనర్‌ అనూరాధా రెడ్డి చెబుతున్నారు. హంటర్‌ మేనల్లుడు అరుదైన ఖడ్గాన్ని 1978లో గ్లాస్గో లైఫ్‌ మ్యూజియంకు అప్పగించినట్లు అధికారిక నివేదిక ద్వారా తెలుస్తోంది. భారత్‌తో స్కాట్లాండ్‌ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మన దేశానికి చెందిన ఏడు చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించనున్నట్లు సమాచారం. అందులో నిజాం కాలానికి చెందిన ఖడ్గం కూడా ఒకటి. హైదరాబాద్‌ రాజ్యానికి సంబంధించినది కనుక ప్రతిష్టాత్మకమైన కరవాలం సాలార్‌జంగ్‌ మ్యూజియంకు పంపే అవకాశం ఉందని చారిత్రక అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.

Read more