ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు మార్చొద్దు

ABN , First Publish Date - 2022-03-23T16:56:12+05:30 IST

ఎప్పుడో ఆమోదం పొందిన లేఅవుట్లను ఇష్టం వచ్చినట్లుగా మార్చడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. కూకట్‌పల్లి హౌసింగ్‌

ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు మార్చొద్దు

పార్కుల ఏర్పాటు ప్రభుత్వ బాధ్యత  

హౌసింగ్‌ బోర్డు తీరుపై హైకోర్టు వ్యాఖ్య  


హైదరాబాద్‌: ఎప్పుడో ఆమోదం పొందిన లేఅవుట్లను ఇష్టం వచ్చినట్లుగా మార్చడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ ఫేజ్‌ 1, 2ల్లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవాలన్న హౌసింగ్‌ బోర్డు నిర్ణయాన్ని తప్పుబట్టింది. పార్కులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఉన్న వాటిని ఎత్తేయడం సరికాదని పేర్కొంది. ‘మీది వ్యాపార సంస్థ కాదు. ప్రజలు తాజా గాలిని పీల్చడానికి అవకాశం ఇవ్వండి’ అని  మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలిల దర్మాసనం వ్యాఖ్యానించింది. 1978లో గుర్తింపు పొందిన లేఅవుట్‌ ప్రకారం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ ఫేజ్‌ 1, 2లో దాదాపు 11 ఎకరాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. దీన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవాలని టీఎస్‌ హౌసింగ్‌ బోర్డు నిర్ణయించింది.


ఇందుకు వ్యతిరేకంగా హౌసింగ్‌ బోర్డు రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ 2009లో హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘకాలం తర్వాత 2017లో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కాలనీ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌కు అనుకూలంగా సింగిల్‌ జడ్జి ధర్మాసనం తీరు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హౌసింగ్‌ బోర్డు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ దాఖలు చేసింది. హౌసింగ్‌ బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1995లో లేఅవుట్‌ను మార్చి కొత్త లేఅవుట్‌ను జారీచేశామని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ద్విసభ్య ధర్మాసనం పార్కు స్థలాన్ని మార్చడాన్ని తప్పుపట్టింది. 

Read more