మళ్ళీ ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-09-28T17:41:06+05:30 IST

మహా నగరంలో వర్షం మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. గంటల కొద్దీ దంచి కొడుతుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం

మళ్ళీ ముంచెత్తిన వాన

భారీ వర్షాలతో గ్రేటర్‌ అతలాకుతలం    

1908 సెప్టెంబర్‌ నాటి వర్షపాతానికి చేరువలో..   

కుండపోతతో నగరవాసుల ఇబ్బందులు 


హైదరాబాద్‌ సిటీ: మహా నగరంలో వర్షం మళ్లీ బీభత్సం సృష్టిస్తోంది. గంటల కొద్దీ దంచి కొడుతుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుండడంతో రోడ్లపై వరద  పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలుస్తుండడంతో స్థానికులు పాట్లు పడుతున్నారు. వర్షాకాలం సీజన్‌ ముగిసిందని భావించిన తరుణంలో ఊహించని వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల 5 నుంచి 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుండడంతో మహానగరం జల సంద్రాన్ని తలపిస్తోంది. 

బాగ్‌ లింగంపల్లి, తిలక్‌నగర్‌, విద్యానగర్‌, నారాయణగూడ, ఆబిడ్స్‌, కోఠి తదితర ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం బృందాలు తీవ్రంగా శ్రమించాయి. సరూర్‌నగర్‌ మండలంలోని భవానీనగర్‌లో అత్యధికంగా ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హస్తినాపురంలో 5.4, అలకపూర్‌లో 4.6, నాగోలు రాక్‌టౌన్‌లో 4.3, బండ్లగూడ, బేగంబజార్‌లో 4.0, చార్మినార్‌లో 3.9, విఠల్‌వాడిలో 3.3, సీతాఫల్‌మండిలో 2.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 


1908 నాటి వర్షపాతానికి.. 

ఇరవై రోజుల క్రితం నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్‌ 5, 6, 7, 8, 9 తేదీల్లో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు గ్రేటర్‌లో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇది.. 1908 సెప్టెంబర్‌ 27న  ఆల్‌టైం రికార్డుగా గ్రేటర్‌లో నమోదైన 15.3 సెంటీమీటర్లకు చేరువలో ఉండడంతో ఆశ్చర్యకరంగా మారింది. సెప్టెంబర్‌ చివరిలో, అక్టోబర్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నగరంలో కురిసిన వర్షం సెప్టెంబర్‌ నెలలో ఇప్పటివరకు అత్యధికమని చెప్పారు. 


అఫ్జల్‌సాగర్‌లో కూలిన గోడ

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మల్లేపల్లి అఫ్జల్‌ సాగర్‌లోని ఓ ఇంటి గోడ కూలింది. అఫ్జల్‌సాగర్‌లో ఉండే భరత్‌ లాల్‌ ఇల్లు వర్షానికి కారుతుండడంతో భార్యతో పాటు నలుగురు పిల్లలను తీసుకొని పక్కనే ఉన్న బంధువుల ఇంట్లోకి వెళ్లాడు. వర్షానికి గోడలు బాగా తడిసి కూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న భరత్‌ లాల్‌, ఆయన కూతురు లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. 


మరో పురాతన ఇంటి గోడ.. 

సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పురాతన ఇంటి గోడ కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాంధీనగర్‌ పటేల్‌నగర్‌ సమీపంలోని ఓ పురాతన ఇంటి గోడ సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆ ఇల్లు కూలిపోయింది.

 

వనస్థలిపురంలో కూలిన ఇంటి బాల్కనీ

మంగళవారం కురిసిన భారీ వర్షానికి హయత్‌నగర్‌ డివిజన్‌లోని కమలానగర్‌లో ఓ ఇంటి బాల్కనీ కూలింది. ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. 


ఈ‘ఏంటీ’దుస్థితి? ఆస్పత్రిలోకి వర్షం నీరు

మంగళ్‌హాట్‌: చెవి, ముక్కు, గొంతు బాధితులకు అత్యాధునిక చికిత్సలు అందించే కోఠి ఈఎన్‌టీ ప్రభుత్వ ఆస్పత్రి వార్డుల్లో వాన కురుస్తోంది. లీకేజీలతో నీళ్లు లోపలకు వస్తున్నాయి. మంగళవారం కురిసిన వానకు అత్యవసర విభాగం మొదలు కొని, పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డుల వరకు అన్నీ నీట మునిగాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి భారీగా నీరు చేరడంతో పాటు భవనాల్లో లీకేజీల కారణంగా వార్డులన్నీ జలమయమయ్యాయి. బెడ్లపై సైతం నీరు కురుస్తుండడంతో రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. పోస్ట్‌ ఆపరేటివ్‌ వార్డు ప్రమాదకరంగా మారింది.


ట్యూబ్‌లైట్లు, విద్యుత్‌ పైప్‌ల గుండా వర్షపు నీరు కురుస్తుండటంతో ఏ గోడలను ముట్టుకుంటే ఎక్కడ విద్యుత్‌ షాక్‌ కొడుతుందో అన్న భయం వెంటాడుతోంది. ఆస్పత్రి అత్యవసర విభాగంలోకి కూడా పెద్ద ఎత్తున వరద చేరింది. కనీసం అడుగు పెట్టే వీలు లేకుండా పోయింది. రోగులను చేర్చుకునే పరిస్థితి కరువైంది. ఈఎన్‌టీ పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వెంటనే ఖాళీ చేయాలని సూచిస్తూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఐదారు సంవత్సరాల క్రితమే ఈఎన్‌టీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. కానీ, అదే భవనంలో నిత్యం దాదాపు 1200 మందికి చికిత్సలు నిర్వ హిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని రోగి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-09-28T17:41:06+05:30 IST