Hyderabad: సాగర్ బస్తిలో వర్షం దెబ్బకు కూలిన ఇల్లు

ABN , First Publish Date - 2022-09-27T17:06:31+05:30 IST

మల్లేపల్లి, సాగర్ బస్తీలో వర్షం దెబ్బకు పాత ఇల్లు కూలిపోయింది. ఇంట్లో కుటుంబసభ్యులు ఉన్న సమయంలో కుప్పకూలింది

Hyderabad: సాగర్ బస్తిలో వర్షం దెబ్బకు కూలిన ఇల్లు

హైదరాబాద్ (Hyderabad): మల్లేపల్లి, సాగర్ బస్తీలో వర్షం దెబ్బకు పాత ఇల్లు (Old House) కూలిపోయింది. ఇంట్లో కుటుంబసభ్యులు ఉన్న సమయంలో కుప్పకూలింది (Collapsed). ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌ నగరాన్ని వరుణుడు ముంచెత్తాడు. సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షంతో భాగ్యనగరం మరోసారి గజగజ వణికిపోయింది. రెండు గంటలకు పైగా కురిసిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై వరద ముంచెత్తడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ నిలిచిపోయి కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, దసరా పండుగ షాపింగ్‌ కోసం వాహనాలతో బయటకు వచ్చిన వారు నానా అవస్థలు పడ్డారు. సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, మలక్‌పేట్‌, కోఠి, మొజాంజాహి మార్కెట్‌, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 


పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా చల్లని వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం పలు చోట్ల మోస్తరు వర్షం కురిసి ఆగిపోయింది. అయితే సాయంత్రం 5.30 గంటలకు ఒక్కసారిగా కుండపోత వాన ప్రారంభమైంది. రెండు గంటలకు పైగా ఏకధాటిగా దంచికొట్టింది. ఉప్పల్‌, రామంతాపూర్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట్‌, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, గణాంకభవన్‌, ఆసి్‌ఫనగర్‌, అల్కాపురి కాలనీల్లో 7 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాంపల్లిలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతమైన అంబర్‌పేటలోని మూసారాంబాగ్‌ వంతెన నీట మునిగింది. దీంతో వంతెన ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. అబ్ధుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 9 సెం.మీ., మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలో 8.3 సెం.మీ, వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌ శివారులో పిడుగు పడి ము స్కు నాగరాజు (32) మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె శివారులో పిడుగుపాటుకు 30 గొర్రెలు చనిపోయాయి. 

Updated Date - 2022-09-27T17:06:31+05:30 IST