త్వరలో మరో 16,940 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-11-30T02:10:33+05:30 IST

ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.

త్వరలో మరో 16,940 పోస్టులకు  గ్రీన్‌ సిగ్నల్‌

ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌

గడువులోగా ఎంపిక పూర్తి కావాలని ఆదేశం

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవల 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మరో 16,940 పోస్టుల భర్తీకి అనుమతినివ్వనుంది. ఉద్యోగ నియామకాల అంశంపై బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఈ విషయాన్ని తెలిపారు. అయితే, ఈ పోస్టులు ఏ శాఖకు చెందినవనే విషయంపై స్పష్టతన్విలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన 80,039 డైరెక్ట్‌ రికూ్ట్రట్‌మెంట్‌ పోస్టుల్లో ఇప్పటివరకు వివిధ శాఖల్లోని పలు కేటగిరీలకు చెందిన 60,929 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేశామని సీఎస్‌ ఈ సందర్భంగా వివరించారు. మరో 16,940 పోస్టులకు అనుమతులు ఇవ్వడానికి అంతా సిద్ధం చేశామని, ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని తెలిపారు.

ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే సంబంధిత బోర్డులు నియామక ప్రక్రియను ప్రారంభించాలని, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాగా, వివిధ పోస్టులకు సంబంధించి సర్వీస్‌ రూల్స్‌లో మార్పులు చేసి అన్ని శాఖలు పూరి సమాచారాన్ని టీఎ్‌సపీఎస్సీకి సమర్పించాలని ఆదేశించారు. అలాగైతేనే నోటిఫికేషన్లు జారీ చేయడానికి టీఎ్‌సపీఎస్సీకి వీలవుతుందన్నారు. పోస్టుల భర్తీ అంశాన్ని ప్రతి రోజూ సమీక్షించుకోవాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, సాధారణ పరిపాలన, ఎస్సీ డెవల్‌పమెంట్‌, ఆరోగ్యం, వ్యవసాయ శాఖల కార్యదర్శులు వి.శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, ఎస్‌ఏఎం రిజ్వీ, రఘునందన్‌రావు, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T02:10:33+05:30 IST

Read more