కౌలు రైతులకూ ప్రభుత్వ ఫలాలు

ABN , First Publish Date - 2022-11-30T03:44:31+05:30 IST

కౌలు రైతులకూ ప్రభుత్వ ఫలాలు అందాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సంఘం రెండో మహాసభలు మంగళవారంతో ముగిశాయి.

కౌలు రైతులకూ ప్రభుత్వ ఫలాలు

రైతు బీమా వయసు 70 ఏళ్లకు పెంచాలి

తెలంగాణ రైతు సంఘం మహాసభల్లో తీర్మానం

నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్‌

నల్లగొండ, నవంబరు 29: కౌలు రైతులకూ ప్రభుత్వ ఫలాలు అందాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సంఘం రెండో మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 27న ప్రారంభమైన ఈ సభలు 29వ తేదీ వరకూ కొనసాగాయి. సంఘం ముగింపు సమావేశంలో రైతాంగ సమస్యలపై పలు తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణ రైతు సంఘం నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శిగా టి.సాగర్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, పి.జంగారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, కాసాని ఐలయ్య, మాదినేని రమేష్‌, బుర్రి శ్రీరాములు, వీరెపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, బి.నర్సింహారెడ్డి, వర్ణ వెంకట్‌రెడ్డి, బుస్సు మధుసూదన్‌రెడ్డిలను ఎన్నుకున్నారు. శాశ్వత ఆహ్వానితులుగా సారంపల్లి మల్లారెడ్డి, బొంత చంద్రారెడ్డిలను నియమించారు.

మహాసభల్లో ఆమోదించిన తీర్మానాలు:

ధరణి లోపాలను సవరించి రైతులందరికీ పాస్‌పుస్తకాలు అందజేయాలి. రైతులకు న్యాయం చేయాలి.

కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చేయాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌలుదారులు లేరని కౌలుచట్టాలు అమలు చేయమని రెవెన్యూ రికార్డులో సాగుదారి కాలమ్‌ను తొలగించారు. రాష్ట్రప్రభుత్వం ఈ విధానాన్ని సవరించుకుని కౌలుదారులకు హక్కులు కల్పించాలి.

రైతుబీమా అర్హత వయసును 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలి. 59 ఏళ్లు దాటి ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు బీమా అందడం లేదు, దీని వల్ల ఆయా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది.

మార్కెట్‌ కమిటీలకు ఎన్నికలు పెట్టి, మార్కెట్లలో జరుగుతున్న అక్రమాలు, దోపిడిని అరికట్టి మార్కెట్‌ సవరణలను అమలుచేయాలి.

Updated Date - 2022-11-30T03:44:31+05:30 IST

Read more