ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు

ABN , First Publish Date - 2022-12-13T00:51:17+05:30 IST

హయత్‌నగర్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, రంగారెడ్డి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌ మేళాలో భాగంగా సోమవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది.

ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు

హయత్‌నగర్‌, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): హయత్‌నగర్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, రంగారెడ్డి జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌ మేళాలో భాగంగా సోమవారం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ(క్రీడా) డైరెక్టర్‌ డాక్టర్‌ వీకే సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. సేంద్రియ ఎరువుల వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రకృతిలో లభ్యమయ్యే నిమ్మ నూనె, నిమ్మ కేకు, వర్మి కంపోస్టు, పశువుల పేడ, కషాయాలతో సేద్యం చేయాలన్నారు. కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. కూరగాయలు, పూలు, గడ్డిజాతి పంటలు, వ్యవసాయ పరికరాలు, సూక్ష్మనీటి సంరక్షణ, వాటర్‌ షెడ్‌ ద్వారా చేపట్టే కార్యక్రమాలపైన శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఉత్తమ రైతు అవార్డు గ్రహీత నాగరత్నంనాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి సేద్యం విధానాన్ని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శ్రాస్త్రవేత్తలు డీబీవీ రమణ, శ్రీకృష్ణ, విజయ్‌కుమార్‌, సుధీర్‌, రామకృష్ణలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు రంగారెడ్డి, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల రైతులతో పాటు కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా, బళ్లారి, బెల్గాం ప్రాంతాల నుంచి 153 మంది రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ అధికారి హరిదాసు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:51:19+05:30 IST