CM KCR Yadadri Power Plant: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌తో దేశానికి కీర్తి

ABN , First Publish Date - 2022-11-29T02:17:20+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి అలా్ట్ర మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

CM KCR Yadadri Power Plant: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌తో దేశానికి కీర్తి

ప్లాంట్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి

కార్పొరేట్లకు తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలో నిర్మాణం

30 వేల మంది సిబ్బంది స్థానికంగా ఉండేలా టౌన్‌షి్‌ప

బొగ్గు నిల్వలకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టాక్‌ యార్డు

హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్తు కనెక్టివిటీ

ప్లాంట్‌లో 576 మంది స్థానికులకు శాశ్వత ఉద్యోగాలు

2,800 మెగావాట్ల లక్ష్యంతో అక్కడే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

2030 కల్లా రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తి: కేసీఆర్‌

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో 4 గంటల పాటు సీఎం పర్యటన

జూన్‌ 2024 నాటికి పవర్‌ ప్లాంట్‌ పూర్తి: జెన్‌కో సీఎండీ

కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు.. ముందస్తు అరెస్టులు

హైదరాబాద్‌/నల్లగొండ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి అలా్ట్ర మెగా థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్లాంట్‌ నిర్మాణం కోసం ప్రైవేట్‌, కార్పొరేట్‌ శక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వ రంగంలోనే చేపట్టామని తెలిపారు. ప్లాంట్‌ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న పవర్‌ ప్లాంట్‌ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తొలుత రెండు హెలికాప్టర్‌లలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మధ్యాహ్నం యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ స్థలికి చేరుకున్న సీఎం.. అనంతరం హెలిప్యాడ్‌ నుంచి పవర్‌ ప్లాంట్‌ ఫేజ్‌-1, యూనిట్‌-2 బాయిలర్‌ నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ అంతస్తుకు చేరుకొని ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంపై జెన్‌కో, బీహెచ్‌ఈఎల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు చేరుకున్న సీఎం.. నాలుగు గంటలపాటు అక్కడే ఉన్నారు. తొలుత రెండు గంటలపాటు ప్లాంట్‌ అంతటా తిరిగి పనులను నిశితంగా పరిశీలించారు. తదుపరి రెండు గంటలు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

2024 జూన్‌ లోపు పూర్తి..

2024 జూన్‌లోగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను పూర్తిచేస్తామని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎంకు వివరించారు. రెండు యూనిట్లు 2023 డిసెంబరుకు, మిగిలినవి జూన్‌ 2024లోపు పూర్తవుతాయని తెలిపారు. ప్లాంట్‌ నిర్మాణం జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్‌ సీఎండీ ప్రభాకర్‌రావును అభినందించారు. 2030 కల్లా రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ 20 వేల మెగావాట్లుగా ఉండబోతోందని, ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి ప్రణాళికలు ఉండాలని అన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులోనే మరో 2,800మెగావాట్ల ఉత్పత్తికి సోలార్‌ పవర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు. యాదాద్రి ప్లాంట్‌ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్తు కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పవర్‌ ప్లాంట్‌కు ప్రతిరోజూ బొగ్గు, నీరు, ఎంత అవసరమనే దానిపై ఆరా తీశారు. దీనికి కృష్ణా నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవేను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ పవర్‌ ప్లాంటుకు దామరచర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్లాంట్‌ నిర్మాణం పూర్తయ్యాక కనీసం 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు 30 లక్షల టన్నులు ఉండేలా చూసుకోవాలని, ఇందుకు అనుగుణంగా స్టాక్‌ యార్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. దేశంలో బొగ్గు నిల్వలు సరిపడా లేక పలు విద్యుత్తు కేంద్రాలు ఉత్పత్తిని తగ్గించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

10 వేల మంది కోసం టౌన్‌షిప్..

పవర్‌ ప్లాంట్‌లో ఏడు నుంచి ఎనిమిది వేల మంది నిరంతరం పనిచేస్తుంటారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వారి కుటుంబాలతో కలిపి మొత్తం 30 వేల మంది జనాభా కోసం 150 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్‌కు సమీపంలోనే భారీ టౌన్‌షి్‌పను నిర్మించాలని సూచించారు. ఇందులో స్పోర్ట్స్‌ క్లాంపెక్స్‌కు 50 ఎకరాలు కేటాయించాలన్నారు. సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్‌ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలన్నారు. దామరచర్ల హైవే నుంచి వీర్లపాలెం పవర్‌ప్లాంట్‌ వరకు ఏడు కిలోమీటర్ల ఫోర్‌ లేన్‌ సీసీ రోడ్లను వెంటనే మంజూరు చేయాలని కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను సీఎం ఆదేశించారు. రైల్వే క్రాసింగ్‌ వద్ద రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణంతోపాటు దామరచర్ల రైల్వేస్టేషన్‌ విస్తరణకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని, ముందుకెళ్లాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రూ.18 వేల కోట్లు వెచ్చించాం..

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ను రూ.29,965 కోట్లతో చేపట్టామని, ఇప్పటిదాకా రూ.18,443.50 కోట్లను వెచ్చించామని సీఎం కేసీఆర్‌కు జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. ఇందుకోసం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి రూ.16,070.54 కోట్లు, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ) నుంచి రూ.4009 కోట్ల రుణం తీసుకుంటున్నామని, ఇప్పటిదాకా ప్లాంట్‌ నిర్మాణం కోసం 61.50 శాతం నిధులను వెచ్చించామని తెలిపారు. రూ.2386 కోట్లు కర్బన ఉద్గారాలు తగ్గించడానికి, పర్యావరణ నియమాల కోసం వెచ్చిస్తున్నామన్నారు. ప్లాంట్‌ నిర్మాణం కోసం ప్రతిరోజూ 42,120 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం ఉంటుందని, రోజుకు 81.6 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఏటా ప్లాంట్‌కు 6.60 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని, ఇందులో 3.71 టీఎంసీలు విద్యుత్తు ఉత్పాదనకు అవసరమని గుర్తు చేశారు. 2024 జూన్‌ కల్లా ప్లాంట్‌లోని ఐదు యూనిట్ల నిర్మాణం పూర్తిచేస్తామని, యూనిట్‌-1ను 2023 సెప్టెంబరులో, యూనిట్‌-2ను 2023 డిసెంబరులో, యూనిట్‌-3ని 2024 మార్చిలో, యూనిట్‌-4, 5లను 2024 జూన్‌ కల్లా పూర్తిచేస్తామని వివరించారు.

కాంగ్రెస్‌ నేతల ముందస్తు అరెస్టు..

సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా థర్మల్‌ ప్లాంట్‌ పరిసరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. పవర్‌ ప్లాంట్‌ కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో ప్లాంట్‌ వద్ద నిరసన తెలిపారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మరోవైపు దామరచర్ల మండలంతోపాటు మిర్యాలగూడ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

576 మంది స్థానికులకు ఉద్యోగాలు

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కు భూమి ఇచ్చిన రైతులతోపాటు గతంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు సహకరించిన రైతుల పెండింగ్‌ సమస్యలను కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను, జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డిని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావుతోపాటు స్థానిక ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించిన ముఖ్యమంత్రి.. అక్కడిక్కడే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నాలుగు గ్రామాలకు చెందిన 576 మంది నిర్వాసిత కుటుంబాలకు ప్లాంట్‌లో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు జెన్‌కో గుర్తు చేసింది.

Updated Date - 2022-11-29T08:36:50+05:30 IST