డబుల్‌ భద్రత మీదే అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి

ABN , First Publish Date - 2022-04-24T18:14:00+05:30 IST

రెండు పడకల ఇళ్ల వద్ద భద్రతా ఏర్పాట్ల బాధ్యత జీహెచ్‌ఎంసీదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల మెమో

డబుల్‌ భద్రత మీదే అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి

జీహెచ్‌ఎంసీ లేఖపై సర్కారు స్పష్టత

సెక్యూరిటీ ఏర్పాట్లకు ఏటా రూ.40 కోట్ల వరకు ఖర్చు

ఇళ్లు పూర్తయి రెండేళ్లు.. 

చోరీకి గురైన వస్తువుల విలువ రూ.20 కోట్లకుపైనే


హైదరాబాద్‌ సిటీ: రెండు పడకల ఇళ్ల వద్ద భద్రతా ఏర్పాట్ల బాధ్యత జీహెచ్‌ఎంసీదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల మెమో పంపింది. పూర్తయి కేటాయించని ఇళ్ల భద్రత స్థానిక మునిసిపాల్టీలు, పంచాయతీలకు అప్పగించాలని కోరుతూ ఇటీవల సర్కారుకు జీహెచ్‌ఎంసీ లేఖ రాసింది. రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో కాంట్రాక్టర్లు ఇళ్లు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ ఏర్పాట్లపై స్పష్టతనివ్వాలని కోరింది. 44 ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డుల నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఏటా రూ.35 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఈ భారం భరించే పరిస్థితి లేనందున స్థానిక సంస్థలకు స్వాధీనం చేయాలని విజ్ఞప్తి చేసింది.


‘ఇళ్ల భద్రతా బాధ్యత మీదే. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి’ అని సర్కారు సమాధానం పంపింది. ఊహించని సమాధానం రావడంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్న సంస్థకు సెక్యూరిటీ ఏర్పాట్లు అదనపు ఆర్థిక భారంగా మారతాయని చెబుతున్నారు. నిరుపేదల ఆత్మగౌరవ నివాసాలుగా గ్రేటర్‌లో రూ.9,850 కోట్లతో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 65 వేల ఇళ్లు పూర్తి కాగా.. ఇన్‌సిటులో నిర్మించిన కేవలం 5 వేల ఇళ్లు లబ్ధి దారులకు అందజేశారు. మిగతా 60 వేల ఇళ్లు అందుబాటులోకి వచ్చినా లబ్ధిదారుల ఎంపికలో జాప్యంతో కేటాయింపు జరుగలేదు. ఏడాది, రెండేళ్ల క్రితమే పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఇళ్లు స్వాధీనం చేసుకోవాలని కొంతకాలంగా జీహెచ్‌ఎంసీని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్పష్టత ఇవ్వాలని సర్కారును కోరగా, భద్రతా ఏర్పాట్ల బాధ్యత బల్దియాదే అని పేర్కొంది. 


గార్డులు, సీసీ కెమెరాలు

ఇళ్లు పూర్తయిన ఏడాది వరకు బాధ్యత కాంట్రాక్టర్లదే అని అధికారులు చెబుతున్నారు. వాటి భద్రతతో పాటు డిఫెక్ట్‌ లయబులిటీ పీరియడ్‌ (డీఎల్‌పీ)లో భాగంగా ఇళ్లలోని సామగ్రి పాడైనా, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తినా వారే మరమ్మతు చేయాల్సి ఉంటుంది. చాలా ఇళ్లు పూర్తయి రెండేళ్లు కావస్తోంది. దీంతో భద్రత తమ వల్ల కాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.


దీంతో 40 ప్రాంతాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రతి సైట్‌లో షిఫ్టునకు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు ఆరుగురు గార్డులు, 1000 అంతకంటే ఎక్కువ ఇళ్లున్న చోట ప్రతి 400-500 ఇళ్లకు సెక్యూరిటీ గార్డులను నియమించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉన్న వారికి తాగునీరు, తాత్కాలిక వసతి, సీసీ కెమెరాల ఏర్పాటు, వాటిని అనుసంధానిస్తూ కంప్యూటర్‌, ఎక్కువ ఇళ్లున్న చోట రాత్రి వేళ విధులు నిర్వర్తించే వారికి తగిన అనుమతితో తుపాకులు ఇవ్వాలని భావించారు. ఇందుకు ఏటా రూ.35  కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 


చోరీ సామగ్రి బాధ్యత ఎవరిది?

పలు ప్రాంతాల్లోని పూర్తయిన ఇళ్లలో సామగ్రి చోరీకి గురైంది. విద్యుత్‌ వైర్లు (కాపర్‌), నల్లాలు, ఎంసీబీలు, జంక్షన్‌ బాక్స్‌లు, లిఫ్ట్‌లు, జనరేటర్లలోని విలువైన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ చోరీలపై కాంట్రాకర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. పది చోట్ల సంస్థలోని ఈవీడీఎం ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించినా చోరీలు ఆగలేదు. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం దొంగతనాలు జరిగిన సామగ్రి విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ వ్యయం ఎవరు భరించాలన్న దానిపైనా స్పష్టత లేదు. వాస్తవంగా జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకునే వరకు ఇళ్ల బాధ్యత కాంట్రాక్టర్లదే. గడువు ముగిసిన అనంతరం జరిగిన దొంగిలించిన వస్తువులు తాము ఏర్పాటు చేయమని కాంట్రాక్టర్లు చెబుతున్నట్టు తెలిసింది. 

Read more