బొజ్జ గణపయ్య.. వెళ్లి రావయ్యా..

ABN , First Publish Date - 2022-09-10T06:43:01+05:30 IST

‘గణపతి బప్పా మోరియా, గణేష్‌ మహరాజ్‌ కీ జై’ అనే నినాదాలతో నగరం హోరెత్తింది.

బొజ్జ గణపయ్య.. వెళ్లి రావయ్యా..
మొజంజాహి మార్కెట్‌ వద్ద గణేశ్‌ శోభాయాత్ర

గ్రేటర్‌లో ఘనంగా నిమజ్జనం  

కిక్కిరిసిన ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు

ప్రశాంతంగా శోభాయాత్ర 


హైదరాబాద్‌ సిటీ, కవాడిగూడ/ఖైరతాబాద్‌, సెప్టెంబర్‌9 (ఆంధ్రజ్యోతి): ‘గణపతి బప్పా మోరియా, గణేష్‌ మహరాజ్‌ కీ జై’ అనే నినాదాలతో నగరం హోరెత్తింది. కనులపండువగా శుక్రవారం మహా నిమజ్జనం కొనసాగింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య గణనాథుడు గంగా ప్రవేశం చేశాడు. బ్యాండ్‌ మోతలు, డప్పుల చప్పుళ్లు, డీజే పాటలతో కోలాహలం ఏర్పడింది. చిన్నా, పెద్దా సంతోషంతో చిందులేశారు. హుస్సేన్‌సాగర్‌ తీరం భక్తులతో జనసంద్రంగా మారింది. ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. 

గణేశుడి శోభాయత్ర నగరంలో శోభాయమానంగా సాగింది. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వీధులు, కాలనీలలో కొలువుదీరిన గణనాథులను తరలించడానికి ద్విచక్రవాహనాలు, కార్లు, ఓపెన్‌ టాప్‌ జీపులు, వ్యాన్లు, డీసీఎంలు, ట్రక్కులను ప్రత్యేక ఆకర్షణతో తీర్చిదిద్దారు. వజ్రోత్సవాల నేపథ్యంలో జాతీయ జెండాలతో నిమజ్జనానికి జనం తరలివచ్చారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు గ్రేటర్‌ పరిధిలోని వందకు పైగా చెరువులు,  జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 74 కొలనుల్లో గణనాథులను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనానికి మొత్తం 16 క్రేన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సమయంలో వర్షం కురిసినా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సాగర్‌లో 3900 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

 లాఠీచార్జీ

ఎన్టీఆర్‌ మార్గంలో మూడు గుర్రాలను భక్తుల మధ్య పరుగులు తీయించారు. పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో భక్తులు ఆందోళన చెందారు. ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌కుమార్‌ అత్యుత్సాహం ప్రదర్శించారని పలువురు వాపోయారు.

వర్షంతో ఆలస్యం 

వర్షం కారణంగా ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర ఆలస్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు కదిలిన ఖైరతాబాద్‌ మహా గణపతి సాయంత్రం 6.58 గంటలకు భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. గణపతిని 1 నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం చేయాలని భావించినా, సాయంత్రం 7 గంటల వరకు జరగడం విశేషం. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహాగణపతి నిమజ్జన శోభాయాత్రలో దాదాపు 2.5 లక్షల మంది భక్తులు వెంటనడిచారు.క్రేన్‌ నెంబర్‌ 4 వద్ద నుండి ఎన్టీఆర్‌ మార్గంలో ఎక్కడ చూసినా ఖైరతాబాద్‌ గణేశుడి కోసం వచ్చిన భక్తులే కనిపించారు. బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. 


లడ్డూ అ‘ధర’హో

బాలాపూర్‌ వినాయకుడి చేతిలోని లడ్డూ ప్రసాదాన్ని వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60లక్షలకు వేలంలో సొంతం చేసుకున్నారు. 

బడంగ్‌పేటలో అందెల శిరీష రూ.12లక్షలకు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు.

కర్మన్‌ఘాట్‌లోని మాధవరం సెరివిటీ నవరాత్రి ఉత్సవాల్లో గణేష్‌ లడ్డూప్రసాదాన్ని జగన్మోహన్‌రెడ్డి రూ.11.12 లక్షలకు సొంతం చేసుకున్నారు.

మంచిరేవులలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ యాదవ్‌ రూ.11లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.

అత్తాపూర్‌ పోచమ్మ దేవాలయంలో న్యూస్టార్‌ భక్త సమాజం లడ్డూను రూ.8.11 లక్షలకు గుమ్మడి భూపాల్‌ రెడ్డి దక్కించుకున్నారు.


విగ్రహాలను నిలిపి.. నిరసన

అఫ్జల్‌గంజ్‌, సెప్టెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాల్లో వీధి/అదనపు దీపాలు ఏర్పాటు చేయకపోవడంపై పలువురు ఉత్సవ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి ఎంజే మార్కెట్‌ మీదుగా సాగర్‌కు వెళ్లే మార్గంలో వెలుగులు లేవంటూ ఎంజే మార్కెట్‌ చౌరస్తాలోని కరాచీ బేకరీ వద్ద కొందరు విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించారు. పది నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో గణనాథుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నిరసన తెలుపుతున్న వారికి సర్దిచెప్పి పంపించారు. 
అడుగడుగునా పోలీస్‌ నిఘా

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 9(ఆంధ్రజ్యోతి): హుస్సేన్‌ సాగర్‌తో పాటు.. ట్రై కమిషనరేట్‌ పరిధిలోని చెరువుల వద్ద నిమజ్జనం కోలాహలంగా సాగింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌లలో ప్రతి విగ్రహానికీ జియోట్యాగింగ్‌ చేయడం  ఫలితానిచ్చింది. ట్రై కమిషనరేట్‌ పరిధిలో 25 వేల మంది పోలీస్‌ సిబ్బందిని రంగంలోకి దించారు. 

సీపీల పర్యవేక్షణ

నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌లు కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ భద్రతను పర్యవేక్షించారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్‌ శోభాయయాత్రలను సీపీ సీవీ ఆనంద్‌ వీక్షించారు. అధికారులతో మాట్లాడుతూ.. సలహాలు, సూచనలు చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంచార్జి శంకర్‌ ఆధ్వర్యంలో 8 గుర్రాలతో పోలీసుల బృందం గస్తీ నిర్వహించింది. 

Read more