జనగణమన

ABN , First Publish Date - 2022-08-17T06:15:35+05:30 IST

జనగణమన

జనగణమన
అబిడ్స్‌ వద్ద జాతీయ గీతాలాపనలో పౌరులు..

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మహానగరం మూకుమ్మడిగా జాతీయ గీతం ఆలపించింది. సరిగ్గా మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషం పాటు ఎక్కడి వారు అక్కడే జనగణమన ఆలపించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు మంగళవారం గ్రేటర్‌లోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో  సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. వేలాది మంది విద్యార్థులతో రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో జాతీయ పతాకాలు చేబూని ర్యాలీలు నిర్వహించారు. చౌరస్తాల వద్ద 11.30 గంటలకు నిమిషం పాటు అన్ని దిక్కులా రెడ్‌ సిగ్నల్‌ వేసి రాకపోకలు నిలిపివేశారు. మెట్రోరైళ్లు, బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఉన్న వారు ఎక్కడికక్కడ జనగణమన ఆలపించారు. ఆబిడ్స్‌ జీపీఓ సర్కిల్‌ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. 

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని విప్రో జంక్షన్‌లో నిర్వహించిన సామూహిక గీతాలాపనలో సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు ఆరు వేల మంది పాల్గొన్నారు. 




మెట్రోలో అమృత్‌ మహోత్సవం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా దివ్యాంగులు, పాఠశాల విద్యార్థులతో మెట్రో జాయ్‌ రైడ్‌ నిర్వహించింది. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌ ట్వింకిల్‌ స్టార్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, బాలాజీనగర్‌కు చెందిన స్వయంకృషి అనాథశరణాలయం నుంచి 20 మంది దివ్యాంగులను అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ నుంచి మియాపూర్‌ స్టేషన్‌కు మెట్రో రైడ్‌లో తీసుకువెళ్లారు. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. దేశభక్తి గీతాలకు అనుగుణంగా దివ్యాంగుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమరవీరులకు నివాళిగా ఉదయం 11.30 గంటలకు అన్ని రైళ్లను 58 సెక్షన్ల పాటూ నిలిపివేశారు. రైలులోనే ఎన్వీఎస్‌ రెడ్డితో పాటు, ఎల్‌అండ్‌టీ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి విద్యార్థులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. 



Updated Date - 2022-08-17T06:15:35+05:30 IST