ఘనంగా గణపయ్యకు వీడ్కోలు
ABN , First Publish Date - 2022-09-11T06:15:39+05:30 IST
గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు రెండో రోజైన శనివారం సాయంత్రం వరకు జరిగాయి.
రెండోరోజు భారీగా నిమజ్జనాలు
ఎన్టీఆర్ మార్గ్ వద్ద కోలాహలం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు రెండో రోజైన శనివారం సాయంత్రం వరకు జరిగాయి. శుక్రవారం రాత్రంతా నిమజ్జనాలు జరిగినా, ఉదయం వరకు భారీ సంఖ్యలో విగ్రహాలు క్యూలో ఉన్నాయి. దీంతో ట్యాంక్‌బండ్‌పైన నిమజ్జనాలు నిలిపివేసి ఎన్టీఆర్ మార్గ్ వైపు దారిమళ్లించారు. సరూర్‌నగర్‌తోపాటు వివిధ చెరువులు, తాత్కాలిక పాండ్లలో నిమజ్జనాలు జరిగాయి. శనివారం సాయంత్రం 5.50 నిమిషాలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4లో చివరి విగ్రహ నిమజ్జనం జరిగింది. దీంతో నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు, ఇతర శాఖల అధికారులు ప్రకటించారు. ఎన్టీఆర్ మార్గంలోని 3 క్రేన్లు మొరాయించాయి. వాటికి మరమ్మతు చేయడంతోపాటు అదనంగా ఉన్న క్రేన్లను వినియోగించారు. మరోపక్క శనివారం కూడా నిమజ్జన శోభాయాత్రలు కొనసాగాయి. దీంతో ఆదివారం తెల్లవారుజాము వరకు నిమజ్జనాలు కొనసాగాయి.
అందరి సహకారంతోనే సక్సెస్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): నిర్వాహకులు, ప్రభుత్వ విభాగాల సహకారంతోనే గణేష్ నవరాత్రోత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్ అన్నారు. నగరంలో నిమజ్జన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన.. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. భాగ్యనగర్, ఖైరతాబాద్, బాలాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని ఉత్సవ సమితి బాధ్యులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. నెల రోజులకుపైగా ఏర్పాట్ల కోసం శ్రమించిన జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీస్, ట్రాఫిక్, ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, పర్యాటక విభాగాల అధికారులకు అభినందనలు తెలిపారు.
గంటల తరబడి పవర్ కట్..
రాత్రంతా చీకట్లో పలు ప్రాంతాలు
ముందస్తు జాగ్రత్తలు తీసుకోని విద్యుత్‌శాఖ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 10(ఆంధ్రజ్యోతి): ఓ వైపు వర్షం.. మరోవైపు నిమజ్జనాలతో పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రామాంతాపూర్ శ్రీనివాసపురం కాలనీలో శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్థానికులు కరెంటు లేక చీకట్లో గడిపారు. ఫిర్యాదు చేసేందుకు విద్యుత్ కార్యాలయాలకు ఫోన్లు చేసినా సిబ్బంది పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకట్లో పిల్లలతో రాత్రంతా దోమల మధ్య నిద్రలేకుండా గడపాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూజ్‌ఆఫ్ కాల్, స్థానిక సిబ్బందికి ఫోన్లు చేస్తే స్విచ్చాఫ్ చేసి పక్కన పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ ఓ ఉన్నతాధికారి తెలిపారు.
7,334 టన్నుల చెత్త తరలింపు
5 వేల మెట్రిక్ టన్నుల నిమజ్జన వ్యర్థాలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): మహా నిమజ్జనం నేపథ్యంలో గ్రేటర్లో చెత్త (గార్బెజ్) పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే దాదాపు వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్త అధికంగా వెలువడిందని శనివారం జీహెచ్ఎంసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నిమజ్జన వీక్షణకు వచ్చే భక్తులకోసం పలు స్వచ్ఛంద, యువజన సంఘాలు, వ్యక్తులు.. అల్పాహారం, భోజనం, ఇతరత్రా ఏర్పాటు చేశారు. ఈ క్రమం లో చెత్త అధికమైంది. ఏకదంతుడిని గంగమ్మ ఒడికి తరలించడంతో మండపాల వద్ద అదనపు వ్యర్థాలు పోగయ్యాయి. మొత్తం 7,334 టన్నుల చెత్త తరలించామని పారిశుధ్య నిర్వహణ విభాగం పేర్కొంది.
89 వేల విగ్రహాల నిమజ్జనం
శుక్ర, శనివారాల్లో గ్రేటర్‌లోని హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువులతోపాటు 74 కొలనుల్లో 89,505 విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. నిమజ్జన మార్గాల్లో 10 వేలకుపైగా పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త తొలగించారు.
ఎప్పటికప్పుడు తొలగింపు
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వ్యర్థాలను హెచ్ఎండీఏ ఎప్పటికప్పడు తొలగించింది. శుక్రవారం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జనమైన విగ్రహాలకు సంబంధించిన 5వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. ఇందుకోసం ఆరు పొక్లెయినర్లు, 15 టిప్పర్లను వినియోగించారు. విగ్రహాల నిమజ్జనంలో తీవ్ర జాప్యం జరగడంతో శుక్రవారం రాత్రి నుంచి వ్యర్థాల తొలగింపు నిలిపివేశారు. శనివారం రాత్రి తొలగింపు మొదలవుతుందని హెచ్ఎండీఏ అధికారొకరు తెలిపారు.
కాసుల వర్షం..
‘మెట్రో’కు రూ.కోటీ 30లక్షల ఆదాయం
నిమజ్జనం రోజున 3.99 లక్షల మంది ప్రయాణం
కొవిడ్ తర్వాత ఇదే ప్రథమం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్లో శుక్రవారం జరిగిన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు కాసుల వర్షం కురిసింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు రూ.కోటీ 30లక్షల ఆదాయం వచ్చింది. 3,99,836 మంది ప్రయాణించారు. రోజువారీ కంటే దాదాపు 40వేల మంది అధికంగా ప్రయాణించడంతో ఎల్అండ్టీకి భారీగా ఆదాయం సమకూరింది. కొవిడ్ తర్వాత ఇంతమంది మెట్రోలో ప్రయాణం చేయడం ఇదే ప్రథమం. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ శుక్రవారం రాకపోకల సమయాన్ని పొడిగించింది. చివరి రైలు అర్ధరాత్రి 1గంటకు బయలుదేరి 2గంటలకు చివరి స్టేషన్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. దీంతో చాలామంది తమ సమీపంలోని మెట్రోస్టేషన్లను ఆశ్రయించి ఖైరతాబాద్ మహాగణపతి శోభా యాత్రను తిలకించారు. అలాగే ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపించారు. ఎక్కువ మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించడంతో ఎల్అండ్టీ, మెట్రో అధికారులు సంతోషం వ్యక్తంచేశారు.
ఆర్టీసీకి రూ.19 లక్షల ఆదాయం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు గ్రేటర్ ఆర్టీసీ 565 స్పెషల్ బస్సులను నడిపింది. నగరంలోని ముఖ్య ప్రాంతాలనుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులతో రూ.19లక్షల అదనపు ఆదాయం వచ్చింది.
లారీ చక్రాల కింద పడి యువకుడి మృతి
మంగళ్‌హాట్, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్తూ లారీ కింద పడి ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు తెలిపిన వివరాలు పాతబస్తీకి చెందిన రవికుమార్, అరుణల కుమారుడు జై సాయి(20) డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం గణేష్ నిమజ్జనం కోసం పాతబస్తీ నుంచి ట్యాంక్‌బాండ్ వెళ్లేందుకు టీఎన్ 34 యూ 1181 లారీని బుక్ చేసుకున్నారు. వాహనంలో మరో మూడు విగ్రహాలను ఎక్కించి నిమజ్జనానికి పయనమయ్యారు. ఆబిడ్స్ చర్మాస్ వద్దకు లారీ చేరుకోగానే నృత్యాలు చేస్తున్న జై సాయి అదే లారీ వెనక చక్రాల కింద ప్రమాదవశాత్తు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.