కోమటిరెడ్డి దారెటు?

ABN , First Publish Date - 2022-11-08T04:46:29+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దారెటన్న చర్చ ..

కోమటిరెడ్డి దారెటు?

ముగిసిన షోకాజ్‌ నోటీసు గడువు

ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు వార్తలు

అధికారికంగా స్పందించని ఎంపీ

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దారెటన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. మునుగోడు ఎన్నికకు ముందు... ఆయన సోదరుడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాల్సిందిగా ఓ నేతకు సూచించిన ఆడియో టేపు బహిర్గతమైన సంగతి తెలిసిందే. అదేవిధంగా మునుగోడులో కాంగ్రెస్‌ గెలవబోదంటూ ఆస్ట్రేలియా పర్యటనలో ఎన్నారైలతో చెబుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. వీటిపై వివరణ ఇవ్వాలంటూ ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ వెంకట్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడమూ తెలిసిందే. అయితే ఉప ఎన్నికకు ముందే ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన వెంకట్‌రెడ్డి... తన వ్యాఖ్యలపైగానీ, షోకాజ్‌ నోటీసుపైగానీ స్పందించలేదు. అయితే షోకాజ్‌ నోటీసుపై వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌ కావడంతో... వాస్తవాలు తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

వాస్తవానికి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరినప్పుడే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ జరగకున్నా... సొంత పార్టీ తరపున ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఎన్నికకు ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిపోయారు. ఇదిలావుండగా, సోమవారం కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ ఏమీ రైలుబండి కాదని, లక్ష్మణ రేఖ దాటినవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షోకాజ్‌ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడి బదులివ్వలేదని చెప్పారు. దీంతో ఒకరిద్దరు మీడియా ప్రతినిధులకు ఫోన్‌లో అందుబాటులోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తాను షోకాజ్‌ నోటీసుకు రెండు రోజుల కిందటే వివరణ ఇచ్చానని, అయితే ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ తారిఖ్‌ అన్వర్‌ అందుబాటులో లేరని చెప్పారు. తనకు షోకాజ్‌ నోటీసు జారీ అయి ఉండగా రాహుల్‌ పాదయాత్రలో ఎలా పాల్గొంటానని, క్లీన్‌చిట్‌ వచ్చాక పాల్గొంటానని చెప్పారు.

Updated Date - 2022-11-08T04:46:52+05:30 IST

Read more