Duplicate license: నకిలీ లైసెన్స్.. రియల్ గన్స్..

ABN , First Publish Date - 2022-11-18T12:23:14+05:30 IST

నకిలీ పత్రాలతో కూడా అసలైన ఆయుధాలు తీసుకోవచ్చనే కొత్త

Duplicate license: నకిలీ లైసెన్స్.. రియల్ గన్స్..

నగరంలో కొత్త తరహా నేరాలు వెలుగులోకి

తప్పుడు పత్రాలతో ఆయుధాలు పొందిన 34 మంది

పోలీసు వర్గాల్లో కలవరం

ఆయుధ లైసెన్స్‌ పొందాలంటే ప్రముఖులే పోలీసుల నియమావళి చూసి ఆశ్చర్యపోతుంటారు. నిబంధనల ప్రకారం ఫారం నింపి చలానా చెల్లించాలి. వ్యాపారులైతే మూడేళ్ల ఆదాయ పన్ను చెల్లింపులు, ఉద్యోగులైతే దానికి సంబంధించిన వివరాలు చూపించాలి. తర్వాత జిల్లా ఎస్పీ, పోలీస్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఆ వివరాలు వాస్తవమేనని ధ్రువీకరించాలి. ఆ తర్వాత హోం సెక్రటరీ నుంచి అనుమతి తీసుకోవాలి. అన్నీ ఓకే అయితే లైసెన్స్‌ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ సాధారణ వ్యక్తుల వద్ద కూడా తుపాకులు ఉంటున్నాయి. చాలామంది వాటిని నకిలీ పత్రాలతో పొందుతున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌ సిటీ: నకిలీ పత్రాలతో కూడా అసలైన ఆయుధాలు తీసుకోవచ్చనే కొత్త తరహా నేరం నగరంలో వెలుగు చూడటం పోలీసు వర్గాల్లో కలవరం రేపుతోంది. 2013లో ఓ వ్యక్తి జమ్మూ కాశ్మీర్‌ నుంచి ఇక్కడికి వచ్చి ఆయుధం ఆయుధం కాకుండా ఎంతోమందికి ఆయుధాలు ఇప్పించి దర్జాగా తిరుగుతున్నా ఇప్పటి వరకు గుర్తించకపోవడం విచారకరం.

నిఘా ఏదీ?

గురువారం సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్న ఓ ముఠాను పట్టుకుంటే తప్పుడు పత్రాలతో పొందిన 34 ఆయుధాలు బయట పడ్డాయి. ఇలాంటి ముఠాలు నగరంలో ఎన్ని ఉండొచ్చు.. వారందరూ సెక్యూరిటీ సంస్థల్లోనే పనిచేస్తున్నారా లేక ఇతర కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ పత్రాలతో ఆయుధాలు, అసలు పత్రాల్లేకుండానే అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తున్న వారిపై నిఘా పెట్టకపోవడానికి కారణాలను పోలీసులు విశ్లేషించాల్సిందే. నగరంలో సెక్యూరిటీ సంస్థల యజమానులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి వారి వద్ద ఉన్న సిబ్బంది... ఎక్కడెక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. వారిలో ఎంతమంది వద్ద ఆయుధాలున్నాయి.. అవి సరైనవేనా.. లేక నకిలీ పత్రాలతో పొందినవా అనే వివరాలు సేకరించాల్సిన ఆవశ్యకత ఉంది.

నిర్లక్ష్యం

పండగకు ఊరెళ్తున్నారా.. మీ ఇంట్లో అద్దెకు కొత్త వారు దిగుతున్నారా? మీ బస్తీలో అపరిచితుల సంచారం పెరిగిందా? వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేయండి అని పోలీసులు ప్రకటనలు ఇస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో ఎంతో ఆసక్తి చూపే పోలీసులు ఆయుధాల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం వహించారనేది ప్రశ్నార్థకంగా మారింది. పంజాగుట్ట ఘటనతో కాస్త తేరుకున్నప్పటికీ.. ఆ ఘటన జరగకపోయి ఉంటే ఇలాంటి ఆయుఽఽధాలు ఇంకా ఎన్ని పెరిగిపోయి ఉండేవోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

10 వేలకు మించి ఆయుధాలు

అధికారిక లెక్కల ప్రకారం లైసెన్స్‌ కలిగి ఉన్న తుపాకులు మూడు కమిషనరేట్లలో కలిపి 7 వేలకు పైగా ఉన్నాయి. నగరంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎదురైనప్పుడు పోలీసులు ఆయా తుపాకులను డిపాజిట్‌ చేయించి తర్వాత తిరిగి ఇచ్చేస్తుంటారు. కానీ.. అక్రమంగా తరలిన ఆయుధాల సంఖ్య మాత్రం పోలీసులకు కూడా తెలియదు. గురువారం వెలుగు చూసిన ఘటనలో తప్పుడు పత్రాలతో పొందిన ఆయుధాలతో తిరుగుతున్న వారెంత మంది అనేది తాజా ప్రశ్న. అలాంటి ఆయుధాలు నగరంలో ఎన్ని ఉన్నాయో ఇప్పటి వరకు పోలీసులకు కూడా తెలియదనేది స్పష్టమైంది. ఆ లెక్కన నగరంలో 10 వేలకు మించి ఆయుఽధాలుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ లెక్క

నగరంలో సుమారు 2,500 ఏటీఎం కేంద్రాలున్నాయి. వాటిలో 20 శాతం అనుకున్నా కనీసం 500 కేంద్రాల వద్ద గన్‌మెన్‌లు ఉంటారు. అదే సంఖ్యలో బ్యాంక్‌లు, బ్రాంచీలు ఉన్నాయి. అక్కడా అదే నిష్పత్తి తీసుకుంటే సుమారు 500 నుంచి వెయ్యి వరకు గన్‌మెన్‌లు ఉన్నారు. జువెలరీ షాపులు, పెద్ద వ్యాపారాలు, కాలేజీ, స్కూళ్ల సెక్యూరిటీ, చాలామంది నియమించుకునే ప్రైవేట్‌ సెక్యూరిటీ ఇలా చూస్తే వేల సంఖ్యలో గన్‌మెన్‌లు ఉంటారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు ఎలా వచ్చాయనే విషయంలో పోలీసులు ఎలాంటి కసరత్తు చేస్తున్నారు.. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉంది.

అన్నీ సవ్యంగా ఉంటేనే..

నగరంలో 100కి పైగా సెక్యూరిటీ ఏజెన్సీలు.. వాటిలో 20 టాప్‌ ఆర్డర్‌లో ఉన్నాయని ఓ సెక్యూరిటీ సంస్థ సీఈఓ తెలిపారు. వెపన్‌లెస్‌ సెక్యూరిటీపైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తుంటామని.. కొన్ని సందర్భాల్లో సాయుధ బలగాల డిమాండ్‌ ఉంటుందన్నారు. అలాంటి సందర్భాల్లో మాజీ సైనికులు, విశ్రాంత పోలీస్‌ అధికారులను నియమించుకొని లైసెన్స్‌, ఆయుధాన్ని పరిశీలించిన తర్వాతే వారిని నియమిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో సైన్యంలో పనిచేశామని.. తమ వద్ద లైసెన్స్‌, ఆయుధం ఉందని కూడా చెబుతారు. వారి మాటలు నమ్మినందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైందనీ, తమ వద్ద మాత్రం అలాంటి సిబ్బంది లేరని ఆయన చెప్పారు.

Updated Date - 2022-11-18T12:24:36+05:30 IST

Read more