ఇక జిల్లాకో డిస్కమ్‌!

ABN , First Publish Date - 2022-11-30T02:22:29+05:30 IST

విద్యుత్తు రంగ ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది.

ఇక జిల్లాకో డిస్కమ్‌!

కరెంటు సరఫరా ‘కనీస ప్రాంతం’పై పరిమితి ఎత్తివేసిన కేంద్రం

అమల్లోకి విద్యుత్తు పంపిణీ లైసెన్స్‌ రూల్స్‌-2022

నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తే ఊరికో పంపిణీ సంస్థ

ఎంత చిన్న ప్రాంతంలోనైనా డిస్కమ్‌ల

ఏర్పాటుకు ఈఆర్సీలు లైసెన్సులు ఇవ్వొచ్చు!

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగ ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. విద్యుత్తు పంపిణీ రంగా న్ని ప్రైవేటీకరించడానికి వీలుగా జిల్లాకో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌) ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంత చిన్న ప్రాంతాన్నైనా.. కరెంటు సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంతం (మినిమమ్‌ ఏరియా ఆఫ్‌ సప్లై)గా ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల కు కట్టబెట్టింది. దీంతో ఆప్రాంత పరిధిలో సమాంతరంగా ఒకటి లేదా అంతకుమించి డిస్కమ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు (ఈఆర్సీ) లైసెన్సులు జారీ చేయవచ్చు. ఈ మేరకు విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్‌-176 ప్రకారం ‘డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ లైసెన్స్‌ రూల్స్‌-2022’ను విడుదల చేస్తూ మంగళవారం కేంద్ర విద్యుత్తు శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఒక మునిసిపల్‌ కార్పొరేషన్‌/పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలు/ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఏదైనా చిన్న ప్రాంతంలో ఒకటికి మించి డిస్కమ్‌ల ఏర్పాటుకు ఈఆర్సీలు లైసెన్స్‌లు జారీ చేసుకోవచ్చు.

డిస్కమ్‌ల ప్రైవేటీకరణ కోసమే..

ఒకే ప్రాంతంలో విద్యుత్తు సరఫరా చేసేందుకు ఎన్ని డిస్కమ్‌లు ముందుకొచ్చినా, రాష్ట్రాల ఈఆర్సీ లు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లు-2022 లో కేంద్రం ప్రతిపాదించింది. ఒకేప్రాంతంలో కరెంటు సరఫరా కోసం ఎక్కువ సంఖ్యలో డిస్కమ్‌లకు తప్పనిసరిగా ‘బహిరంగ విపణి’ సదుపాయం కల్పించాలం టూ ఇంకో కీలక ప్రతిపాదనా చేసింది. విద్యుత్తు సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంత పరిధిపై పరిమితులను ఎత్తివేస్తూ తాజా గా కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తేవడంతో భవిష్యత్తులో భారీగా ప్రైవేటు కంపెనీలు రానున్నాయి.

8 ఏళ్లలో 45 వేల కోట్ల నష్టాలు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్తర (ఎన్పీడీసీఎల్‌), దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌)లతో పాటు రెస్కో(సిరిసిల్ల) డిస్కమ్‌లు ఉన్నాయి. తెలంగాణలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా.. 141 పట్టణాలు, 128 మునిసిపాలిటీలతో పాటు 13 మునిసిపల్‌ కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకొని నోటిఫై చేస్తే 33 జిల్లాల్లో లేదా 141 పట్టణాల్లో లేదా 128 మునిసిపాలిటీలతో పాటు 13 కార్పొరేషన్లలో డిస్కమ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొచ్చు. రాష్ట్రంలో జెన్‌కో/ట్రాన్స్‌కోలు లాభాల్లో ఉండగా.. డిస్కమ్‌లు 8 ఏళ్లలో రూ.45 వేల కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నాయి. నష్టాల సాకుతో ప్రైవేట్‌ డిస్కమ్‌ల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం తీసుకునేందుకు వీలుగా కేంద్ర నిబంధనలు ఉన్నాయి.

Updated Date - 2022-11-30T02:22:30+05:30 IST