శారీ.. సారీ..!

ABN , First Publish Date - 2022-09-29T17:34:15+05:30 IST

బతుకమ్మ పండుగ మొదలైంది. బుధవారం నగరంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. అక్టోబర్‌ 2న సద్దుల బతుకమ్మ జరగనుంది. ఇప్పటికీ నగరంలో చీరల పంపిణీ జోరందుకోలేదు. గ్రేటర్‌లో

శారీ.. సారీ..!

బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం

కానుక కోసం ఎండలో మహిళలు.. సౌకర్యాలు లేక ఇబ్బందులు


హైదరాబాద్‌ సిటీ: బతుకమ్మ పండుగ మొదలైంది. బుధవారం నగరంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. అక్టోబర్‌ 2న సద్దుల బతుకమ్మ జరగనుంది. ఇప్పటికీ నగరంలో చీరల పంపిణీ జోరందుకోలేదు. గ్రేటర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ గందరగోళంగా మారింది. ప్రభుత్వం అందజేస్తోన్న కానుక తీసుకోవడంలో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. లక్షలాది మందికి చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా.. తగిన ఏర్పాట్లు చేయడంలో జీహెచ్‌ఎంసీలో పూర్తిగా విఫలమైంది. 

మహానగరంలో అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌ (యూసీడీ) విభాగం ద్వారా 15.85 లక్షల చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కిళ్లు, నియోజక వర్గాల వారీగా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రేషన్‌ పంపిణీ దుకాణాల వారీగా లబ్ధిదారులకు చీరలు అందజేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లు, ప్లే గ్రౌండ్‌లు, పాఠశాలల ప్రాంగణాలు తదితర 984 కేంద్రాల్లో చీరలు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలో ఎండలో నిరీక్షించలేక వృద్దులు, చిన్నారులతో వచ్చిన మహిళలు అవస్థలు పడుతున్నారు. 

ఇప్పటి వరకు బల్దియాకు 8.83 లక్షల చీరలు అందగా.. వాటి పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. 20 శాతం లోపే పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. 


కుత్బుల్లాపూర్‌: కొన్ని కేంద్రాల్లో స్టాక్‌లేక బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోయింది. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో లబ్ధిదారులకు అనుగుణంగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కావల్సినవి 1,43,570..  అందినవి 62,875..

జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం 1,43,570 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు 62,875 చీరలు మాత్రమే అందాయి. గాజులరామారం సర్కిల్‌లో ప్రస్తుతానికి స్టాక్‌ లేదు. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరంగా గత సంవత్సరం మొత్తం 38,116 బతుకమ్మ చీరలను,  గాజులరామారం సర్కిల్‌ పరంగా 42,846 చీరలతో మొత్తం 80,962 చీరలు పంపిణీ చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జంట సర్కిళ్లకు ఇంకా 80,695 చీరలు చేరాల్సి ఉంది. ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు లబ్ధిదారులకు అందుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-09-29T17:34:15+05:30 IST