Khairatabad: జనవరి 31 వరకు గడువు.. లేకుంటే భారీ జరిమానా

ABN , First Publish Date - 2022-12-30T11:44:41+05:30 IST

ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన జీహెచ్‌ఎంసీ వ్యాపార లైసెన్స్‌లను జారీ చేసేది.

Khairatabad: జనవరి 31 వరకు గడువు.. లేకుంటే భారీ జరిమానా

హైదరాబాద్/ఖైరతాబాద్‌: ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన జీహెచ్‌ఎంసీ వ్యాపార లైసెన్స్‌లను జారీ చేసేది. కొత్త సంవత్సరం నుంచి క్యాలెండర్‌ ప్రాతిపదికన మంజూరు చేయనున్నారు. వ్యాపారులు ఆన్‌లైన్‌లోగాని, మీసేవా కేంద్రాల్లో గాని లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకొని జనవరి 1 నుంచి 31వ తేదీలోపు కొత్త వాటిని పొందాలని అధికారులు సూచించారు. 2022లో తీసుకున్న అన్ని లైసెన్స్‌లు రద్దవుతాయని పేర్కొన్నారు.

జంట సర్కిళ్లలో 25వేలకు పైగానే..

జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ జంట సర్కిళ్లలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 25వేల పైచిలుకు వ్యాపారులు లైసెన్స్‌ పొందారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లో టిన్‌ నెంబర్‌ కలిగిన లైసెన్స్‌లు 15,427 మందికి ఉండగా వారి ద్వారా జీహెచ్‌ఎంసీకి ఈ యేడు రూ. 61 కోట్ల 19 లక్షల ఆదాయం సమకూరింది. ఇక నెంబర్లు లేని కొత్త లైసెన్స్‌లు దాదాపు 2,350 వరకు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ సర్కిల్‌లో 6,738 మంది టిన్‌ నెంబరు కలిగిన లైసెన్సుదారుల ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.45 కోట్ల 68 లక్షల ఆదాయం సమకూరగా నెంబర్లు లేని లైసెన్స్‌లు 2,524 వరకు ఉన్నాయి. వ్యాపార లైసెన్స్‌లను మొదట సర్కిళ్ల అధికారులే జారీ చేయగా మధ్యలో కొన్నాళ్లు కేవలం లైసెన్సింగ్‌ అధికారులకే బాధ్యతలు ఇచ్చినా, ప్రస్తుతం లైసెన్సింగ్‌ అధికారుల కొరత వల్ల తిరిగి సర్కిళ్ల వైద్యాధికారులకే ఆ బాధ్యతలను అప్పగించారు.

దుకాణాల్లో లైసెన్స్‌లు ప్రదర్శించాల్సిందే..

జనవరి 1 నుంచి కొత్త వ్యాపార లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రస్తుతమున్న ట్రేడ్‌ లైసెన్స్‌ల గడువు 31 మార్చి వరకు ఉన్నా, డిసెంబర్‌ 31కే రద్దయిపోతాయని అధికారులు చెప్పారు. 30 అడుగుల కంటే తక్కువ విస్తీర్ణం గల రోడ్డుపై వ్యాపారులకు చదరపు అడుగుకు రూ.3, 30 నుంచి 40 అడుగులలోపు ఉన్న రోడ్డులో వ్యాపారులకు చదరపు అడుగుకు రూ.4, 40 అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం గల రోడ్లపై వ్యాపారాలున్న వారికి చదరపు అడుగుకు రూ.6 చొప్పున ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు చేయనున్నారు. డిసెంబర్‌ 31లోపు లైసెన్స్‌లు తీసుకొని వాటిని దుకాణాల్లో ప్రదర్శించాలని లేనట్లయితే రూ.10 వేల నుంచి 50 వేల వరకు జరిమానాలు విధించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

వ్యాపారులు కొత్త లైసెన్స్‌ తీసుకోవాల్సిందే..

కొత్త నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి ప్రతి ఒక్కరూ వ్యాపార లైసెన్స్‌ పొందాల్సిందే. పాతవి డిసెంబర్‌ 31తో రద్దయినట్లే. ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీఎ్‌స/ట్రేడ్‌ డాట్‌ జీహెచ్‌ఎంసీ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ లోకి వెళ్లి అవసరమైన సమాచారాన్ని అందించి లైసెన్స్‌ పొందవచ్చు. మీసేవా కేంద్రాల్లోగాని, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లలోగాని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సమాచారం తప్పుగా ఇచ్చినా తనిఖీల్లో తేలితే భారీ జరిమానాలు తప్పవు. వ్యాపారులందరూ జనవరి 31లోపు కొత్త వ్యాపార లైసెన్స్‌లు తీసుకోవాలి.

- మోహన్‌రెడ్డి, ఉప కమిషనర్‌, సర్కిల్‌-17(ఖైరతాబాద్‌)

Updated Date - 2022-12-30T11:44:43+05:30 IST