ఆరు నెలల పరిచయం..60 లక్షలు కొట్టేశాడు..

ABN , First Publish Date - 2022-09-28T17:17:44+05:30 IST

ఆరు నెలల పరిచయాన్ని అనువుగా మార్చుకున్నాడు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి పక్కా ప్లాన్‌తో రూ. 60 లక్షలు కొట్టేశాడు

ఆరు నెలల పరిచయం..60 లక్షలు కొట్టేశాడు..

వాట్సాప్‎లో బంగారం ఫొటోలు  చూపించి బురిడీ

బ్యాగులో పేపర్‌ బండిళ్లు పెట్టి మోసం

8 మంది అరెస్టు, రూ. 45.10 లక్షల సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ: ఆరు నెలల పరిచయాన్ని అనువుగా మార్చుకున్నాడు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి పక్కా ప్లాన్‌తో రూ. 60 లక్షలు కొట్టేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 45.10 లక్షల నగదు, 13 సెల్‌ఫోన్లు, ఎనిమిది సిమ్‌కార్డులు, కారు, బైక్‌, రెండు సూట్‌కేసులు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ మంగళవారం వివరాలు వెల్లడించారు. 


సరూర్‌నగర్‌ వీవీనగర్‌కు చెందిన తల్లూరి వెంకటేశ్వర్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. అతడికి ఆరు నెలల క్రితం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ మహే్‌షతో పరిచయం ఏర్పడింది. వెంకటేశ్వర్లుకు బాగా డబ్బుందని గుర్తించిన మహేష్‌ పథకం వేసి కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు తెలిసిన వారి వద్ద కేజీల కొద్దీ బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తారని వెంకటేశ్వర్లును నమ్మించాడు. కేజీ బంగారం రూ. 40 లక్షల చొప్పున ఇప్పిస్తానని చెప్పాడు. వాట్సా్‌పలో బంగారం ఫొటోలు చూపించాడు. నిజమని నమ్మిన వెంకటేశ్వర్లు కేజీన్నర బంగారం కొనేందుకు సిద్ధమయ్యాడు. పది రోజుల క్రితం రూ. 60 లక్షలు సిద్ధం చేసుకున్నాడు. 

తొమ్మిది మంది కలిసి ముఠాగా..

వివిధ ప్రాంతాలకు చెందిన రియాజ్‌, వినీ్‌షకుమార్‌, కర్రి కనకారావు, ఉడుత రవి, కోహెడ సురేందర్‌, షేక్‌ సైదులు, అనుమోలు సైదులు, ప్రసన్నలతో మహేష్‌ ముఠాను ఏర్పాటు చేశాడు. కనకరాజు, వినీ్‌షకుమార్‌, ఉడుత రవికి దృష్టి మరల్చి మోసాలు చేయడంలో అనుభవం ఉంది. ముఠాలో ఒకరిద్దరికి మినహా.. ఒకరికొకరు ముఖపరిచయం కూడా లేకపోవడం గమనార్హం. 

సూట్‌కేసులతో ఏమార్చి..

మహేష్‌ ఒక్కడే డబ్బు, బంగారం గురించి వెంకటేశ్వర్లుతో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ నెల 20న బంగారంతో తమ మనుషులు ఇంటికి వస్తారని, రూ. 60 లక్షల నగదు చూపించి బంగారం తీసుకోవాలని నమ్మించాడు. ముఠా సభ్యులంతా దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో వద్దకు చేరుకున్నారు. కర్రి కనకారావు ప్రసన్న సూట్‌కేసుతో బాధితుడి ఇంటికి వెళ్లారు. ముందుగా డబ్బులు ఇస్తేనే బంగారం ఇస్తామని నమ్మించారు. దాంతో బాఽధితుడు రూ.60 లక్షల నగదు వారి చేతికి ఇచ్చాడు. డబ్బు కట్టలను కేటుగాళ్లు సూట్‌కేసులో పెట్టుకున్నారు. ముఠా సభ్యులకు ఫోన్‌ చేసి బంగారం తీసుకు రావాలని చెబుతున్నట్లుగా నటించారు. కుశల ప్రశ్నలతో, కుటుంబ వివరాలు బాధితుడితో సరదాగా గడిపారు. అరగంట దాటినా బంగారం రాకపోవడంతో.. ‘ఏదో పొరపాటు జరిగినట్లుంది. మీ బంగారం తెచ్చాకే డబ్బులు తీసుకుంటాం’ అని డబ్బులు తిరిగి ఇస్తున్నట్లు నటించారు. బాధితుడి దృష్టి మళ్లించి సూట్‌కేసులో రెండు కంపార్ట్‌మెంట్‌లు ఉన్న విషయాన్ని కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఒకే రకమైన రెండు బ్లాక్‌ కలర్‌ బ్యాగులను రెండు కంపార్టుమెంట్‌లలో పెట్టారు.  పేపర్‌ బండిళ్లు నింపిన బ్యాగ్‌ను బాధితుడికి ఇచ్చారు. బంగారం తెచ్చి డబ్బు తీసుకెళ్తామని చెప్పి సూట్‌కేసు తీసుకొని వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత బ్యాగును బాధితుడు పరిశీలించగా, మొత్తం కలర్‌ పేపర్‌ బండిళ్లు ఉన్నాయి. దీంతో బాధితుడు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ టీమ్‌, సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారామ్‌ టీమ్‌ సాంకేతిక ఆధారాలతో దొంగల ముఠాను పట్టుకున్నారు. రూ. 45.10 లక్షలు రికవరీ చేశారు. సిబ్బందిని సీపీ అభినందించారు.

Read more