CM KCR: ఆంధ్రలో భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ప్లాన్?

ABN , First Publish Date - 2022-10-05T17:10:50+05:30 IST

ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతికి భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

CM KCR: ఆంధ్రలో భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ప్లాన్?

హైదరాబాద్ (Hyderabad): ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్రాంతికి భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏపీలో బీఆర్ఎస్‌ (భారత రాష్ట్రీయ సమితి)కు ఆదరణ ఉంటోందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలియవచ్చింది.


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)..  భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎ్‌స)గా మారేందుకు సర్వం సిద్ధమైంది. పార్టీ పేరు, పరిధిని మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చేసేశారు. బుధవారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో కూడిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తోంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీల పట్ల ఆ పార్టీ వైఖరిని వివరించనున్నారు. తమ జాతీయ పార్టీ లక్ష్యాలు, అజెండాను వెల్లడించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్న మొత్తం 283 మంది.. టీఆర్‌ఎస్‌ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్‌ నోట జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన రానుంది. అనంతరం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న వారందరితో కలిసి భోజనం చేశాక.. విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. 


జేడీఎస్‌ నేతల రాక.. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు కార్యక్రమానికి రావాల్సిందిగా పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలకు కేసీఆర్‌ ఆహ్వానాలు పంపించారు. ఈ మేరకు కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు తమిళనాడు నుంచి విదుతలై చిరుతైగల్‌ కచ్చి (వీసీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్‌ కూడా వచ్చారు. ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనతోపాటు సీఎం ఆహ్వానం అందుకున్నవారిలో తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావు కూడా ఉన్నారు. వీరిద్దరికి ప్రగతిభవన్‌ ముందున్న ఐటీసీ కాకతీయ హోటల్లో బస ఏర్పాటుచేశారు. 

Updated Date - 2022-10-05T17:10:50+05:30 IST