30 కోట్లంటే నమ్మలేక పోయా!

ABN , First Publish Date - 2022-12-30T03:50:22+05:30 IST

‘నా బ్యాంకు ఖాతాలో ఏనాడూ 50 దిర్హాంలకు మించి నిల్వ లేదు.

30 కోట్లంటే నమ్మలేక పోయా!

నా ఖాతాలో ఏరోజూ 50 దిర్హాంలకు మించలేదు

15 మిలియన్లు జమకావడం సాయిబాబా కృపే

దుబాయిలో లాటరీ విన్నర్‌ ఒగ్గుల అజయ్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : ‘నా బ్యాంకు ఖాతాలో ఏనాడూ 50 దిర్హాంలకు మించి నిల్వ లేదు. అలాంటిది లాటరీలో 15 మిలియన్ల దిర్హాంలను గెల్చుకోవడం, ఆ మొత్తం నా బ్యాంకు ఖాతాలో జమ కావడం నమ్మలేకపోతున్నా. సాయి బాబ కృపతోనే లాటరీలో ఇంత పెద్ద మొత్తాన్ని పొందగలిగాను’ అని దుబాయిలో తెలంగాణ ప్రవాసీ అయిన జగిత్యాల జిల్లా తుంగూరుకు చెందిన ఒగ్గుల అజయ్‌ పేర్కొన్నాడు. దుబాయిలోని ఓ వజ్రాల వ్యాపారి వద్ద అజయ్‌ డ్రైవర్‌గా పని చేస్తుండగా.. యజమాని ప్రోత్సాహంతో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు 15 మిలియన్ల దిర్హాంలు (భారతీయ కరెన్సీలో రూ.30 కోట్లు) బహుమతి దక్కిన విషయం విదితమే. ఈ సందర్భంగా అజయ్‌ తన సంతోషాన్ని వెల్లడిస్తూ.. ‘పదేళ్లుగా గల్ఫ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న నాకు సొంత ఇల్లు లేదు. దాన్ని నిర్మించే పనిలో అప్పుల పాలయ్యాను. పైగా ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇలాంటి దుర్భర స్థితిలో నా యజమాని ప్రోత్సాహంలో లాటరీ టికెట్‌ కొనుగోలు చేయగా అదృష్టం తలుపు తట్టింది. రూ.30 కోట్లు దక్కాయి’ అని పేర్కొన్నాడు. మొదట తాను ఫోన్‌లో వచ్చిన సందేశాన్ని చూసి నమ్మలేకపోయానని, కేవలం రూ.లక్షన్నర అనుకున్నానని, ఆ తర్వాత కోట్లలో డబ్బు వచ్చిన విషయాన్ని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానని చెప్పాడు. తండ్రి చనిపోగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనకు ఈ సమయంలో కోట్లలో అదృష్టం దక్కడం కలగా ఉందని అన్నాడు. కాగా, కోట్లలో లాటరీ పొందిన అజయ్‌ వద్దకు వెళ్లి సంతోషాన్ని పంచుకునేందుకు కుటుంబ సభ్యులు పాస్‌పోర్టు కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు వారికి స్లాట్‌ దొరకడం లేదు. దీంతో వారు చివరికి మంగళవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దరఖాస్తు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు పాస్‌పోర్టులు వచ్చాక, వీసాలు తీసుకుని వారిని ఇక్కడికి రప్పించుకుంటానని, కుటుంబ సభ్యులతో యజమానిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని అజయ్‌ తెలిపాడు. యజమాని సలహా తీసుకుని లాటరీలో గెలిచిన డబ్బుతో దుబాయిలో వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు.

Updated Date - 2022-12-30T03:50:23+05:30 IST