‘బస్తీ’తో పెద్దమేలు

ABN , First Publish Date - 2022-11-12T04:16:05+05:30 IST

బస్తీ దవాఖానాల ఏర్పాటు ఫలితాన్నిస్తోంది! ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంతో పెద్దాస్పత్రులపై భారం బాగా తగ్గుతోంది. ఔట్‌ పేషంట్ల (ఓపీలు) సంఖ్య బాగా తగ్గడంతో ఆ సమయాన్ని వైద్యులు శస్త్రచికిత్సలకు కేటాయిస్తున్నారు.

 ‘బస్తీ’తో పెద్దమేలు

బస్తీ దవాఖానాలతో పెద్దాస్పత్రులపై తగ్గిన భారం

ప్రస్తుతం గ్రేటర్‌ సహా 4 జిల్లాల్లో 293 బస్తీ దవాఖానాలు

జనవరిలోగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో ఏర్పాటు

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): బస్తీ దవాఖానాల ఏర్పాటు ఫలితాన్నిస్తోంది! ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంతో పెద్దాస్పత్రులపై భారం బాగా తగ్గుతోంది. ఔట్‌ పేషంట్ల (ఓపీలు) సంఖ్య బాగా తగ్గడంతో ఆ సమయాన్ని వైద్యులు శస్త్రచికిత్సలకు కేటాయిస్తున్నారు. ఫలితంగా గ్రేటర్‌ పరిధిలోని ప్రధాన పెద్దాస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో సర్జరీలు జరుగుతున్నాయి. గత రెండేళ్లలో ఈ ఆస్పత్రుల్లో ఓపీల సంఖ్య సగానికి సగం తగ్గింది. ఈ మేరకు బస్తీ దవాఖానాల్లో ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, పెద్దాస్పత్రుల్లో తగ్గిన ఓపీ వివరాలతో కూడిన వివరాలను వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసింది. వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2018లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారభించింది. ఈ ఏడాది హైదరాబాద్‌లో ప్రతినెలా సగటున 45,994, మేడ్చల్‌లో 16,198, రంగారెడ్డిలో 3,796 చొప్పున ఓపీ నమోదైంది. ప్రతి బస్తీదవాఖానా సగటున రోజుకు 70-80 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఉస్మానియాలో 60శాతం తగ్గారు

ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాక 2019తో పోల్చితే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ఓపీ గణనీయంగా తగ్గింది. 2019లో ఉస్మానియాలో మొత్తం 12 లక్షల మంది ఓపీ వస్తే ప్రస్తుతం అది 4.99 లక్షలకు తగ్గింది. గాంఽధీ ఆస్పత్రుల్లో 6.42 లక్షల నుంచి 3.68 లక్షలకు తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, నగరంలోని మురికి వాడల్లో బస్తీ దవాఖానాలేనని వైద్య వర్గాలు తెలిపాయి. దగ్గు, జలుబు, చిన్నపాటి జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తితే పెద్దాస్పత్రులకు వెళ్లకుండా బస్తీ దవాఖానాలకు వెళుతున్నారని పేర్కొన్నాయి. ఫలితంగా పెద్దాస్పత్రుల్లో శస్త్రచికిత్సలు పెరిగాయని వెల్లడించాయి.

ఎందుకు ఆదరణ

బస్తీ దవాఖానాల్లో తొలినాళ్లలో వైద్యులు, రోగుల్ని చూసి మందులురాసే వరకే పరిమితమయ్యేవారు. అయితే ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడంతో ఇక్కడికొచ్చే రోగుల్లో అవసరమైన వారికి టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి నమూనాలను సేకరించి వాటిని టీ డయాగ్నస్టిక్‌ పంపి రిపోర్టులు ఆధారంగా వైద్యం అందిస్తున్నారు. బస్తీ దవాఖానాలకు వచ్చిన రోగుల నుంచి 21.34 లక్షల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 30 వరకు 67.81 లక్షల నమూనాలను సేకరించి టెస్టుల కోసం టీ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు పంపారు. హైదరాబాద్‌లోని కొన్ని బస్తీ దవాఖానాల్లో ఇమేజ్‌ టెస్టులు (ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, ఈసీజీ ) లాంటివి కూడా చేస్తున్నారు. పైగా అక్కడ క్వాలిపైడ్‌ డాకర్లు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉన్నారు. మందులను ఉచితంగా ఇస్తున్నారు.

దోస్తీ దవాఖానాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలు మంచి ఫలితాలిస్తున్నాయి బస్తీల్లో ప్రజల సుస్తీని పోగొట్టి వారికి దోస్తీ దవాఖానాలుగా మారాయి,. ఇప్పటివరకు 293 బస్తీ దవాఖానాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. హైదరాబాద్‌ బయట మునిసిపాలిటీలు, జిల్లాల్లో కొత్తగా మరో 227 బస్తీ దవాఖానాలను జనవరి చివరినాటికి ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం రాష్ట్రవ్య్తాప్తంగా 520 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకానున్నాయి. ఇవి దేశానికి ఆదర్శం. దేశంలోని వివిధ నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలని 15వ ఆర్థిక సంఘ సూచించింది. ఇది మన పనితీరుకు నిదర్శనం. ముఖ్యంగా పేదలకు నాణ్యమైన వైద్యం, మందులను పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. ప్రజలు ఈ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

- హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

ప్రైవేటు క్లినిక్స్‌ మూతపడ్డాయి

గోల్కండ పరిధిలో 13 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవన్నీ త్రీడి కాన్సె్‌ప్టతో పనిజేస్తున్నాయి. అంటే డాక్టర్‌, డయాగ్నస్టిక్‌, డ్రగ్‌ అన్నమాట. ఉదయం 9 గంటలకే దవాఖానాలు తెరుస్తున్నాం. పది నుంచి ఓపీ విపరీతంగా ఉంటోంది. గతంలో చిన్నచిన్న చిన్న సమస్యలు రాగానే ఇక్కడికి వస్తుంటంతో ఆ మేరకు జబ్బులు ముదరకుండానే చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ టెలిమెడిసిన్‌ సేవలు కూడా అందుబాటులోఉన్నాయి. వాటి ద్వారా స్పెషలిస్టు వైద్యుల సలహాలను రోగులు తీసుకుంటారు. అవసరమైన వారికి టెస్టులు చేసి మందులిస్తాం. రోగుల జీవన ప్రమాణాలు పెంచే సలహాలు, సూచనలు ఇస్తాం. బస్తీ దవాఖానాల వల్ల చుట్టూ ఉన్న అనేక చిన్నచిన్న ప్రైవేటు క్లినిక్‌లన్నీ మూతపడ్డాయి. అక్కడికి రోగులు వెళ్లడం మానేశారు. అలాగే ప్రతి గురువారం సీనియర్‌ సిటిజన్స్‌కు బీపీ, షుగర్‌ టెస్టులు చేస్తున్నాం. మందులూ ఇస్తున్నాం.

- డాక్టర్‌ అనురాధ, సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌, గోల్కొండ, హైదరాబాద్‌.

Updated Date - 2022-11-12T04:16:05+05:30 IST

Read more