strike: భగీరథ కార్మికుల సమ్మెబాట!
ABN , First Publish Date - 2022-12-31T03:36:02+05:30 IST
మిషన్ భగీరథ కార్మికులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు.

ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో యోచన
రాష్ట్ర వ్యాప్తంగా రూ.150 కోట్ల జీతాల బకాయి
జనవరి రెండో వారంలో సమ్మెకు కార్మికుల సన్నాహాలు
విధుల బహిష్కరణ, నీటి సరఫరా నిలిపివేతకు నిర్ణయం
భగీరథ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం
19 నెలలుగా రూ.844 కోట్ల బిల్లుల పెండింగ్
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ కార్మికులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని, పైగా ఐదు నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వడంలేదని కార్మికులు వాపోతున్నారు. భగీరథ ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని, దాంతో వారు తమకు జీతాలివ్వడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు మిషన్ భగీరథ కార్మిక సంఘం చెబుతోంది. జనవరి 2వ తేదీ నుంచి జిల్లాల వారీగా కార్మికుల సమావేశాలు నిర్వహించనున్నట్లు, అనంతరం ఏ క్షణమైనా సమ్మెకు పిలుపునిచ్చే అవకాశమున్నట్లు పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేసేందుకుగాను భగీరథ కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలకే 10 ఏళ్లపాటు మెయింట్నెన్స్ను కూడా అప్పగించింది. ఆయా కంపెనీలు వర్క్ ఏజెన్సీల ద్వారా పథకం అమలు కోసం వివిధ కేటగిరీల కింద క్యాడర్ వారీగా రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది కార్మికులకు నియమించుకున్నాయి. కానీ, 5 నెలల నుంచి మిషన్ భగీరథ కార్మికులకు జీతాలు ఇవ్వడంలేదు. దాదాపు రూ.150 కోట్ల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు భగీరథ ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లించాల్సి రూ.844 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం తమకు 19 నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదని, దీంతో తాము కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని వర్క్ ఏజెన్సీలు జిల్లాల కలెక్టర్లకు చెబుతున్నాయి. సర్కారు బిల్లులు చెల్లిస్తే కార్మికుల జీతాలు పూర్తిగా చెల్లిస్తామంటూ అధికారులకు లేఖలు రాస్తున్నారు.
ఇపుడు రైతుబంధు ఉంది.. తరువాత చూద్దాం..
భగీరథ కార్మికులు తమ జీతాల బకాయి అంశాన్ని ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ వద్దకు తీసుకెళ్లగా.. రాష్ట్రంలో ఇపుడు రైతుబంధు నిధులు అందుతున్నాయని, దీని గురించి తరువాత మాట్లాడదామని సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఫైల్‌ను ఎన్నిసార్లు పంపినా వెనక్కి వస్తుంది తప్ప.. బిల్లులు రావడం లేదని కార్మికులతో ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం మాట్లాడుతుందని, ఆ తరువాత పట్టించుకోవడలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించబోయే జిల్లాల సమావేశాల్లోనే విధుల బహిష్కరణ, నీటి సరఫరాను నిలిపివేసేలా తీర్మానాలు చేయాలని, ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇవ్వాలని కార్మికులు నిర్ణయించారు. ఏజెన్సీల బకాయిల చెల్లింపుతోపాటు కార్మికుల జీతాల చెల్లింపునకు రాష్ట్ర స్థాయిలో పాలసీని అమల్లోకి తీసుకురావాలని, జీవో నెంబర్ 14 ప్రకారం జీతాలు, ఈఎ్‌సఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమ్మెకు పిలుపునివ్వాలని భావిస్తున్న యూనియన్ అధికార పార్టీ కార్మిక విభాగానికి చెందినది కావడం గమనార్హం. మిగతా యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలపనున్నాయి.
పట్టించుకోని కార్మికశాఖ ..
మిషన్ భగీరథలోని కార్మికులకు ప్రాజెక్టు ప్రారంభమైన తరువాతి రెండేళ్ల నుంచి ప్రతి ఏటా జీతాల అంశం ఇబ్బందికరంగానే మారింది. భగీరథ ప్రాజెక్టు కాకుండా మిగతా రంగాల్లోని కార్మికులకు కూడా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎ్‌సఐ తదితర సౌలభ్యాలు అందడంలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా..రాష్ట్రంలో వివిధ రంగాల్లోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కార్మిక శాఖ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కేటగిరీల వారీగా భగీరథలో కార్మికులను నియమించుకున్న వర్క్ ఏజెన్సీలు అందుకు విరుద్ధంగా జీతాలను ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నా.. కార్మిక శాఖ మాత్రం వర్క్ ఏజెన్సీలతో చర్చించలేదు. పైగా ఈఎ్‌సఐ, పీఎ్‌ఫను కూడా అందించేలా చర్యలు తీసుకోలేదని కార్మికులకు కార్మిక శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమ్మె యోచన అందుకే..
మిషన్ భగీరథ కార్మికుల సమస్యలను అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. 16 వేల మంది కార్మికులు జీతాలు సమయానికి అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క జీతాలే కాకుండా.. ఈఎ్‌సఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే జిల్లాల సమావేశాల తరువాత నోటీసులు ఇచ్చి సమ్మెకు పిలుపునివ్వాలని నిర్ణయించాం.
- మద్దెల రవి
Read more