Begumpet Minister Road: నాలా అభివృద్ధి పనుల కోసం..

ABN , First Publish Date - 2022-11-23T13:01:32+05:30 IST

బేగంపేట్‌లోని మినిస్టర్‌ రోడ్‌ వద్ద ఉన్న నాలా అభివృద్ధి పనుల నిమిత్తం మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

Begumpet Minister Road: నాలా అభివృద్ధి పనుల కోసం..

హైదరాబాద్‌ సిటీ: బేగంపేట్‌లోని మినిస్టర్‌ రోడ్‌ వద్ద ఉన్న నాలా అభివృద్ధి పనుల నిమిత్తం మూడు నెలల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర సీపీ సీవీ.ఆనంద్‌ తెలిపారు. రసూల్‌పురా నుంచి రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనదారులకు కుడి వైపు అనుమతినివ్వకుండా.. నేరుగా సీటీఓ ఫ్లైఓవర్‌ యూటర్న్‌ తీసుకుని హనుమాన్‌ టెంపుల్‌, ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌, మినిస్టర్‌ రోడ్‌, కిమ్స్‌ ఆస్పత్రి వరకు అనుమతిస్తారు. రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి రసూల్‌పురా వైపు వాహనాలు అనుమతించరు.

రాంగోపాల్‌ పేట్‌ పీఎస్‌ వద్ద నుంచి కుడి వైపు తిరిగి సింధీ కాలనీ, ఫుడ్‌వరల్డ్‌, హనుమాన్‌ టెంపుల్‌ ద్వారా రసూల్‌పురా వెళ్లాలి. సికింద్రాబాద్‌ నుంచి కిమ్స్‌ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనదారులు హనుమాన్‌ టెంపుల్‌ వద్ద నుంచి ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌ పేట్‌ పీఎస్‌ నుంచి ఎడమ వైపు తిరిగి మినిస్టర్‌ రోడ్‌, కిమ్స్‌ చేరాలి. కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లే అంబులెన్స్‌లు బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి సీటీఓ వద్ద యూటర్న్‌ తీసుకుని సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ ద్వారా కిమ్స్‌ చేరాలి. బస్సులు, డీసీఎంలు, లారీలను హనుమాన్‌ టెంపుల్‌ నుంచి సింధీ కాలనీ వైపు అనుమతించరు. రాణిగంజ్‌ రూట్‌ ద్వారా మినిస్టర్‌ రోడ్‌ చేరాలి. వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.

Updated Date - 2022-11-23T13:02:46+05:30 IST

Read more