చికెన్‌ కర్రీ అయిపోయిందన్నందుకు..

ABN , First Publish Date - 2022-07-27T16:16:15+05:30 IST

బహిరంగంగా మద్యం సేవించడమే కాకుండా తాము అడిగితే చికెన్‌ కర్రీ లేదంటావా అంటూ హాస్టల్‌ యజమానిని కొందరు చితకబాదారు

చికెన్‌ కర్రీ అయిపోయిందన్నందుకు..

హాస్టల్‌ యజమానిపై దాడి

హైదరాబాద్/పంజాగుట్ట: బహిరంగంగా మద్యం సేవించడమే కాకుండా తాము అడిగితే చికెన్‌ కర్రీ లేదంటావా అంటూ హాస్టల్‌ యజమానిని కొందరు చితకబాదారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడ సుభా్‌షనగర్‌కు చెందిన అనిల్‌ కుమార్‌ స్థానికంగా శ్రీ వెంకటేశ్వర బాయ్స్‌ హాస్టల్‌ను నడిపిస్తున్నాడు. ఈనెల 24న రాత్రి స్థానికంగా పాన్‌షాప్‌ నిర్వహిస్తున్న ఫిరోజ్‌ తన స్నేహితులతో కలిసి బహిరంగంగా మద్యం తాగుతూ తినడానికి చికెన్‌ కర్రీ కావాలని హాస్టల్‌లో అడిగాడు. కర్రీ అయిపోయిందని అనిల్‌ కుమార్‌ చెప్పడంతో ‘నేను అడిగితే లేదని చెబుతావా.. నా ఏరియాలో హాస్టల్‌ ఎలా నడుపుతావో చూస్తాను..’ అంటూ ఫిరోజ్‌ అతన్ని బలవంతంగా స్నేహితుడి కార్యాలయానికి లాక్కెళ్లాడు. అక్కడ ఫిరోజ్‌ తన స్నేహితులు రమేష్‌, ఫయాజ్‌, జహీర్‌లతో కలిసి అనిల్‌ కుమార్‌ను చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో అతను వెంటనే ఫిర్యాదు చేయలేదు. మంగళవారం పంజాగుట్ట పీఎస్‌లో అనిల్‌ కుమార్‌ వారిపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more