Young Woman Kidnapped: నిశ్చితార్థం వేళ.. 50 మందితో వచ్చి యువతి కిడ్నాప్‌!

ABN , First Publish Date - 2022-12-10T03:36:01+05:30 IST

అమ్మాయి, అబ్బాయి తరఫు వారి బంధువులతో కళకళలాడుతోంది. నిశ్చితార్థం కోసం అమ్మాయిని అందంగా ముస్తాబు చేస్తున్నారు!

Young Woman Kidnapped: నిశ్చితార్థం వేళ.. 50 మందితో వచ్చి యువతి కిడ్నాప్‌!

తల్లిదండ్రులు, బంధువులపై రాడ్లు, కర్రలతో దాడి

ఫర్నిచర్‌, సీసీకెమెరాలు, కార్ల అద్దాలు ధ్వంసం

తండ్రికి గాయాలు.. 40 నిమిషాలపాటు బీభత్సం

నిందితుడు, యువతి గతంలో ప్రేమికులు

కన్నవారు ఓకే అంటేనే పెళ్లని అతడికి ఆమె స్పష్టం

ఒప్పుకోని తల్లిదండ్రులు.. మరో సంబంధం ఖాయం

మందీ మార్బలంతో వెళ్లి అపహరించిన యువకుడు

తాను క్షేమమేనంటూ తండ్రికి యువతి ఫోన్‌

ఆమెను సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులు

8 మంది అరెస్టు.. మిగతావారి కోసం గాలింపు

ఆదిభట్ల, హయత్‌నగర్‌, హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 9: ఆ ఇల్లంతా.. వివాహ నిశ్చితార్థ వేడుకలతో సందడిగా ఉంది! అమ్మాయి, అబ్బాయి తరఫు వారి బంధువులతో కళకళలాడుతోంది. నిశ్చితార్థం కోసం అమ్మాయిని అందంగా ముస్తాబు చేస్తున్నారు! ఆ సమయంలో.. ఓ యువకుడు, యాభై మందిని పోగేసుకుని అక్కడికొచ్చాడు. వారిలో కొందరు ముఖాలకు మాస్కులు ధరిస్తే.. ఇంకొందరు తలకు హెల్మెట్‌ పెట్టుకొన్నారు. చాలామంది చేతుల్లో ఇనుప రాడ్లు, దుడ్డుకర్రలున్నాయి! ఆ గుంపును చూసి షాక్‌ తిన్న ఇంట్లోని వారు తేరుకోక ముందే.. దుండగులు ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులను బూతులు తిడుతూ రాడ్లు, కర్రలతో ఇష్టారీతిన దాడి చేశారు. స్థానికుల్లో కొందరు అడ్డుకుంటే వారినీ కొట్టారు. 40 నిమిషాల పాటు ఽబీభత్సం సృష్టించి మరీ.. నిశ్చితార్థం కోసం సిద్ధం చేసిన అమ్మాయిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని రాగన్నగూడలో శుక్రవారం మధ్యాహ్నం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడిని ‘మిస్టర్‌ టీ’ పేరుతో టీ షాపులు నిర్వహించే కొడగుల నవీన్‌ రెడ్డిగా గుర్తించారు. ఆధిభట్ల సీఐ నరేందర్‌ వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన ముచ్చర్ల దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతులు గత ఐదేళ్లుగా రాగన్నగూడలోని సిరి హిల్స్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు వైశాలి ఉంది. ఆమె బీడీఎస్‌ పూర్తి చేసి.. దంతవైద్యురాలిగా ప్రాక్టీస్‌ చేస్తోంది. నవీన్‌ రెడ్డి కూడా ఆమె చదివిన కాలేజీలోనే ఫార్మసీ చదివాడు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదవడంతో పరిచయమేర్పడింది. రోజూ బొంగులూరులోని షటిల్‌ గ్రౌండ్‌లో కలుసుకునేవారు. ఇద్దరి మధ్య చనువు ప్రేమకు దారితీసింది.

పెళ్లికి అంగీకరించకపోవడంతోనే

నవీన్‌ రెడ్డి తరచూ వైశాలి వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. తల్లిదండ్రులు ఇష్టపడితేనే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పేది. పెళ్లికి నవీన్‌ రెడ్డి తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు. ఒకరోజు వారు, వైశాలి ఇంటికివెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. నవీన్‌-వైశాలి ప్రేమించుకున్నారని.. ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని ప్రతిపాదన తెచ్చారు. దీనికి వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీన్ని మనసులో పెట్టుకొన్న నవీన్‌ రెడ్డి, వైశాలి తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు. గతంలో వైశాలితో తాను చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఇది తెలిసి వైశాలి.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఆధిభట్ల పోలీసులు, నవీన్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వైశాలికి ఆమె తల్లిదండ్రులను మరో సంబంఽధాన్ని ఖాయం చేశారు. శుక్రవారం నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు వరుడు, అతడి కుటుంబీకులు వైశాలి ఇంటికొచ్చారు. ఇది తెలుసుకున్న నవీన్‌ కోపంతో రగిలిపోతూ.. తన అనుచరులతో వైశాలి ఇంటిపైకి వెళ్లాడు.

కార్లు, ఫర్నిచర్‌, పూలకుండీలు ధ్వంసం!

వేడుక జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులంతా గుంపుగా ఇంట్లోకి రావడంతో వైశాలి తండ్రి దామోదర్‌రెడ్డి హడలిపోయారు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అని ప్రశ్నిస్తుండగానే రాడ్లు, కర్రలతో ఆయన తలపై కొట్టారు. తలకు తీవ్ర గాయమై... రక్తం కారుతున్న స్థితిలో తండ్రిని చూసిన వైశాలి, ఆమె తల్లి భయంతో ఇంట్లోని బయటకు పరుగులు తీశారు. ఇద్దరినీ అడ్డుకున్న నవీన్‌, వారి గొంతుపట్టుకొని ఊపిరాడకుండా చేశాడు. అనంతరం వైశాలిని బలవంతంగా తన కారులోకి ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే అతడి అనుచరులు ఇంట్లో పెను విధ్వంసం సృష్టించారు. లోపల ఫర్నిచర్‌,, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. బయట పార్క్‌ చేసి ఉన్న కార్ల అద్దాలు పగుల గొట్టారు. ఘటనను ఓవ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఆ ఫోన్లను పగులగొట్టారు. దాడికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కుటుంబసభ్యులు, కాలనీ వాసుల ధర్నా

మిస్టర్‌ టీ యజమాని నవీన్‌రెడ్డి కొంత కాలంగా వైశాలిని ప్రేమ పేరుతో వేఽధిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె కుటుంబసభ్యులు, కాలనీవాసులు ఆరోపించారు. దాడి సమయంలో డయల్‌-100కు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. దీనికి కార ణం సీఐ నరేందరేనని, ఆయన్ను సస్పెండ్‌ చేయాలని నాగార్జునసాగర్‌ రోడ్డు మీద ధర్నాకు దిగారు. దీంతో రెండు గంటలపాటు రెండువైపులా ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వైశాలి ఇంటి ము ందు నవీన్‌ రెడ్డి, కొంత స్థలాన్ని అద్దెకు తీసుకుని షెడ్డు వేశాడు. వైశాలిని అపహరించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఆ షెడ్డును తగులబెట్టారు.

పోలీసుల అదుపులో నవీన్‌ రెడ్డి

శుక్రవారం సాయంత్రానికి వైశాలి తన తండిక్రి ఫోన్‌ చేసి.. తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. ఫోన్‌ కాల్‌ ఆధారంగా లోకేషన్‌ ట్రాప్‌ చేసిన పోలీసులు ఆమె నల్లగొండలో ఉన్నట్లు గుర్తించారు. అక్కణ్నుంచీ ఆమెను సురక్షితంగా తీసుకువచ్చామని.. యువతిని భయభ్రాంతులకు గురిచేయడంతో ప్రస్తుతం ఆమె షాక్‌లో ఉందని రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన ఆదిభట్ల పీఎ్‌సలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరు గంటల్లోనే ఈ కేసును ఛేదించామని.. ఈ ఘటనలో ఎనిమిది మందిని పట్టుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని, వారినీ త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో నవీన్‌ రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం. కానీ, పోలీసులు ధ్రువీకరించలేదు.

Updated Date - 2022-12-10T03:53:45+05:30 IST