Sharmila Arrest : షర్మిల అరెస్టు

ABN , First Publish Date - 2022-11-29T02:05:56+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర రణరంగంగా మారింది. వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు.

Sharmila Arrest :  షర్మిల అరెస్టు

బలవంతంగా హైదరాబాద్‌కు తరలింపు

వరంగల్‌ జిల్లాలో రణరంగంగా పాదయాత్ర

క్యారవాన్‌కు నిప్పు పెట్టిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

షర్మిల వాహనాలపై రాళ్లతో దాడి

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

పోలీసుల వైఖరిపై షర్మిల ఆగ్రహం

తెలంగాణ చరిత్రలో ఇదో బ్లాక్‌ డే

బీఆర్‌ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి: షర్మిల

వరంగల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర రణరంగంగా మారింది. వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. షర్మిల పాదయాత్రలో ఉండగా.. కిలోమీటరు దూరంలో ఉన్న ఆమె క్యారవాన్‌కు నిప్పు పెట్టారు. పాదయాత్రను అడ్డుకునేందుకు అడుగడునా ప్రయత్నించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఆమె పాదయాత్రకు 223వ రోజు బ్రేక్‌ పడినట్లయింది. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. చెన్నారావుపేట, ఖాదర్‌పేట, జల్లి మీదుగా శంకరమ్మతండా దగ్గరికి చేరుకోగానే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుతగిలారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. అయినా వారు అడ్డు తగులుతూనే ఉన్నారు. లింగగిరి గ్రామ శివారులో మధ్యాహ్న సమయంలో షర్మిల బస చేసే క్యారవాన్‌పై ప్లాస్టిక్‌ కవర్లలో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు మంటలను ఆర్పివేశారు.

అనంతరం బస్సు సమీపంలోకి చేరుకున్న షర్మిల మీడియాతో మాట్లాడి క్యారవాన్‌లోకి వెళ్లారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందన్న కారణంతో పోలీసులు మరోసారి షర్మిలతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అరెస్టు చేసి, బలవంతంగా హైదరాబాద్‌కు తరలించారు. ఆమెను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని సైతం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పాటు వెనక వస్తున్న షర్మిల బస్సు, ఇతర వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. బస్సు అద్దాలతో పాటు షర్మిలకు చెందిన ఫార్చ్యూనర్‌ వాహనం అద్దాలను పగులగొట్టారు. దారి వెంట టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కువగా ఉండడం, రాళ్లతో దాడులు చేస్తుండడంతో వాహనాలను, బస్సును చెన్నారావుపేట పోలీసుస్టేషన్‌కు తరలించారు.

క్షమాపణలు చెప్పాలంటూ గొడవ

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఉదయం నుంచి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాదయాత్రకు అడ్డు తగులుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అలాంటి వ్యక్తిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. ‘షర్మిల గో బ్యాక్‌’ అంటూ నినదించగా.. ప్రతిగా ‘కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పొలాల్లో దాక్కొని రాళ్లతో వాహనాలపై దాడి చేశారు. షర్మిలను అరెస్టు చేశాక కూడా, క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.

పోలీసుల ప్రేక్షక పాత్ర

ఉదయం నుంచి పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని పసిగట్టిన పోలీసులు, ఆ తర్వాత చర్యలపై దృష్టి సారించలేకపోయారు. షర్మిల పాదయాత్రను విరమించుకోవాలని సూచించారే తప్ప, పాదయాత్రను అడ్డుకోవడానికి బయలుదేరిన టీఆర్‌ఎస్‌ అనుచరులను నిలువరించలేకపోయారు. క్యారవాన్‌ సమీపంలోకి వచ్చిన కార్యకర్తల చేతిలో రాళ్లను చూసిన పోలీసులు చెదరగొట్టారు. కానీ, వారిని అరెస్టు చేయకపోవడంపై షర్మిల విరుచుకుపడ్డారు. పోలీసులు కావాలనే పాదయాత్రను అడ్డుకోవడానికి ఆందోళనకారులకు వత్తాసు పలికారని ఆరోపించారు. పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తప్పుతుందనే ఉద్దేశంతోనే అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

పాదయాత్రను ఆపడానికి కుట్ర

3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశానని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని షర్మిల అన్నారు. స్థానిక నేతల అక్రమాలను ఎండగట్టడం తప్పా అని ప్రశ్నించారు. ఒక ప్లాన్‌ ప్రకారమే తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. పోలీసుల కళ్లెదుటే దుండగులు తిరుగుతూ, రాళ్లతో దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని, లా అండ్‌ ఆర్డర్‌ సమస్యను సృష్టించి మరీ పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. తమ వాహనాలకు టీఆర్‌ఎస్‌ నేతలు నిప్పు పెట్టిన వీడియోలున్నాయని, పోలీసులకు చూపించినా వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. దాడులు చేయడం వెనక పోలీసుల పాత్ర ఉందని ధ్వజమెత్తారు.

Updated Date - 2022-11-29T03:50:08+05:30 IST