పౌర సమస్యలు పట్టించుకోకుండా.. మొన్న Apple Mobiles, నిన్న కొత్త ఏసీలు.. ఎందుకిలా..!

ABN , First Publish Date - 2022-03-19T12:04:13+05:30 IST

పౌర సమస్యలు పట్టించుకోకుండా.. మొన్న Apple Mobiles, నిన్న కొత్త ఏసీలు.. ఎందుకిలా..!

పౌర సమస్యలు పట్టించుకోకుండా.. మొన్న Apple Mobiles, నిన్న కొత్త ఏసీలు.. ఎందుకిలా..!

  • పాలకమండలి సూచనతో ఏర్పాటు
  • క్యాంప్‌ ఆఫీస్‌లో జనరేటర్లు, అధునాతన యాపిల్‌ ఫోన్లు..
  • ఇప్పుడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో ఏసీలు


హైదరాబాద్‌ సిటీ : పౌర సమస్యలు పట్టించుకోని ప్రస్తుత పాలకమండలి తమ సౌకర్యాలకు మాత్రం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఎప్పుడు నిర్వహిస్తారో, అసలు సమావేశాలు ఉంటాయో లేదో తెలియని కౌన్సిల్‌హాల్‌కు కొత్త ఏసీల ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న ఏసీలను తొలగించారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి స్ర్కాప్‌ కింద వాటిని విక్రయించారు. వాటి స్థానంలో 11 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు ఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.


తదుపరి సమావేశం నాటికి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. త్వరలో ప్రశ్నోత్తరాలు, బడ్జెట్‌పై చర్చ కోసం కౌన్సిల్‌ మీటింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాలపై కొత్త ఏసీల ఏర్పాటుకు ఇంజనీరింగ్‌ భవన నిర్వహణ అధికారులు చర్యలు ప్రారంభించారు. స్ర్కాప్‌కు విక్రయించిన పాత ఏసీలతో రూ.30 వేలలోపే ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏసీలో ఉండే యంత్రాలు, కాపర్‌కు విలువ ఎక్కువగా ఉంటుందని, ఎనిమిది పాత ఏసీలకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని సిబ్బంది పేర్కొంటున్నారు. గతంలోనూ వివిధ విభాగాల్లో తొలగించిన పాత ఫర్నిచర్‌ అమ్మకంలోనూ జీహెచ్‌ఎంసీకి లక్షల రూపాయల్లో నష్టం జరిగిందని చెబుతున్నారు. నెలల తరబడి భవనం బయట ఉంచడంతో ఎండకు ఎండి, వానకు తడిసి పాడయ్యాయని, దీంతో ఎక్కువ డబ్బులు రావని ఉన్నతాధికారులను మభ్యపెట్టి తమకు తెలిసిన వారికి ఎక్కువ ధరకు విక్రయించారని చెబుతున్నారు. 2002లో ఏర్పాటు చేసిన ఏసీలకు తరచూ మరమ్మతు వస్తుండడంతో కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్టు ఓ అధికారి చెప్పారు.

Read more