‘ననుమాస’ జీవిత చరిత్రను ఆత్మకథగా రాయాలి

ABN , First Publish Date - 2022-01-03T17:21:07+05:30 IST

ప్రొఫెసర్‌ ననుమాస స్వామి జీవిత చరిత్రను ఆయనే ఆత్మకథగా రాయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉదయశ్రీ పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్‌ ననుమాస స్వామి రచించిన

‘ననుమాస’ జీవిత చరిత్రను ఆత్మకథగా రాయాలి

హైదరాబాద్/పంజాగుట్ట : ప్రొఫెసర్‌ ననుమాస స్వామి జీవిత చరిత్రను ఆయనే ఆత్మకథగా రాయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉదయశ్రీ పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్‌ ననుమాస స్వామి రచించిన ‘ప్రవహిస్తున్న జైలు గానం’, ‘సాధువు గాడ్గే బాబా’, ‘బోనాలు’ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాలను మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. అనంతరం కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రొఫెసర్‌ ననుమాస స్వామి గురించి తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వారికి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన దళిత, బహుజన ఉద్యమంతో మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలు జీవితాన్ని కూడా అనుభవించారన్నారు. బోనాల గురించి రాసిన పుస్తకంలో.. కుండకు, బోనానికి ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించారని పేర్కొన్నారు.


వివిధ దేవతారాధనలు, పండుగలు, వాటి మూలాల సమాచారం ఈ పుస్తకంలో ఉందన్నారు. ప్రవహిస్తున్న జైలు గానం పుస్తకంలో తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను రాశారన్నారు. మరో పరిశోధనా గ్రంథం సాధువు గాడ్గే బాబా జీవిత చరిత్ర పుస్తకమని జస్టిస్‌ చంద్రయ్య పేర్కొన్నారు. స్వామి జీవితమంతా అన్వేషణేనని, విద్యార్థిగా, అధ్యాపకుడిగా, ఆచార్యునిగా, ఉద్యమ, చరిత్రకారుడిగా, తెలుగు పండితుడిగా, సాహితీవేత్తగా ఆయన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయుడు పాశం యాదగిరి, రాష్ట్ర సీఐడీ అదనపు ఎస్పీ పగడాల అశోక్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎన్‌. యాదగిరి, ప్రొఫెసర్‌ దార్ల వెంకటేశ్వరరావు, కృష్ణ మోహన్‌, డాక్టర్‌ కోటేశ్వరరావు, తిరుపతి, సత్యనారాయణ, జగదీశ్‌, ననుమాస సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T17:21:07+05:30 IST