కాంగ్రెస్ కు స్థలం కేటాయింపుపై కంటోన్మెంట్‎లో కాక

ABN , First Publish Date - 2022-09-30T18:06:43+05:30 IST

వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి బోయినపల్లి శివారులో పదెకరాల స్థలంలో తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ నిర్మించాలని ప్రతిపాదించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి

కాంగ్రెస్ కు స్థలం కేటాయింపుపై కంటోన్మెంట్‎లో కాక

హైదరాబాద్/సికింద్రాబాద్‌: వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి బోయినపల్లి శివారులో పదెకరాల స్థలంలో తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ నిర్మించాలని ప్రతిపాదించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి అనుమతి విషయమై కంటోన్మెంట్‌ పాలక మండలి సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. డాక్టర్‌ వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా, బోయినపల్లి శివారులోని రక్షణ శాఖకు చెందిన (ఏ-1) పది ఎకరాల స్థలాన్ని భూ బదలాయింపు కింద బి-2 కేటగిరి (రాష్ట్ర ప్రభుత్వ) స్థలంగా మార్పిడి చేసుకున్నారు. అనంతరం వ్యక్తిత్వ వికాసాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు ఆ స్థలాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించారు. ప్రస్తుతం ఆ స్థలంలో నిర్మాణానికి అనుమతివ్వాలంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి పేరిట వచ్చిన దరఖాస్తుపై గురువారం కంటోన్మెంట్‌ పాలక మండలి సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతివ్వొద్దంటూ బీజేపీకి చెందిన కంటోన్మెంట్‌ సివిల్‌ నామినేటెడ్‌ సభ్యుడు జె.రామకృష్ణ, ఎక్స్‌అఫీషియో సభ్యుడు, స్థానిక ఎమ్మెల్మే జె.సాయన్న పట్టుపట్టారు. ఇప్పటి వరకూ కంటోన్మెంట్‌లో ఇతరులకు ఇస్తున్నట్టుగానే, నిర్మాణానికి అనుమతించాలంటూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్‌రెడ్డి కోరారు.


అనుమతిస్తే సీబీఐకి ఫిర్యాదు చేస్తా: జె.రామకృష్ణ 

బోయినపల్లి శివారులో కాంగ్రెస్‌ పార్టీకి భవనాన్ని నిర్మించాలనుకుంటున్న ఈ స్థలాన్ని కేటాయించి పదేళ్లు దాటిందని, నిబంధనల ప్రకారం ఆ స్థలంపై కాంగ్రెస్‌ పార్టీకి హక్కు లేదని, ఆ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని రామకృష్ణ వాదించారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు స్థలాన్ని వినియోగంలోకి తీసుకోవాలని, అందుకే ఇప్పుడు నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలంటే కలెక్టర్‌ నుంచి మళ్లీ ఎన్‌ఓసీ తీసుకురావాలని దరఖాస్తుదారుకు చెప్పాలని అన్నారు. దీనికి టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు సాయన్న సైతం మద్ధతు పలుకుతూ స్థలంపై న్యాయస్థానంలో వివాదం నడుస్తున్నదని, కోట్లాది రూపాయల విలువైన 50వేల గజాల స్థలంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టే నిర్మాణాన్ని తాము ఒప్పుకోమని పేర్కొన్నారు. అయితే తాము ఈ విషయమై ఇప్పటికే ఐదు నెలలుగా, పలు దఫాలు కలెక్టర్‌కు లేఖ రాశామని, అక్కడి నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కానందున నిర్మాణానికి అనుమతి ఇవ్వొచ్చంటూ కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్‌ సోమశంకర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి అజిత్‌రెడ్డిలు చెప్పారు. స్థల కేటాయింపు అంశం తమ పరిధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ నుంచి అభ్యంతరాలు రానందున పర్మిషన్‌ ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. తన అభ్యంతరాన్ని పట్టించుకోకుండా, నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తే సీబీఐకి ఫిర్యాదు చేస్తానని, రక్షణ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని రామకృష్ణ హెచ్చరించారు. దాంతో సోమశంకర్‌, అజిత్‌రెడ్డిలు తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. మరోసారి కలెక్టర్‌కు లేఖ రాస్తామని, 30 రోజుల్లోపు ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే, తుది నిర్ణయం తీసుకుంటామని సోమశంకర్‌, అజిత్‌రెడ్డిలు ప్రకటించారు.

Read more