Ahmedabad Serial Blast Case : మూలాలు హైదరాబాద్‌లోనే.. ఆ నెట్‌వర్క్‌ డొంక కదిలిందిలా..!

ABN , First Publish Date - 2022-02-19T14:31:22+05:30 IST

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా.. మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటాయి..! ఎవరు అవునన్నా.. కాదన్నా.. పదేళ్ల క్రితం వరకు ఇది నిజం. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు అప్పట్లో...

Ahmedabad Serial Blast Case : మూలాలు హైదరాబాద్‌లోనే.. ఆ నెట్‌వర్క్‌ డొంక కదిలిందిలా..!

  • తొలుత అరెస్టయిన బషీర్‌ మకాం ఇక్కడే
  • నగరంలో పలు కేసుల్లో ఇతని ప్రమేయం
  • ముగ్గురు నిందితులు పట్టుబడిందీ నగరలోనే
  • నగోరీ సోదరులకు హైదరాబాద్‌తో అనుబంధం
  • మెహిదీపట్నంలో కొంతకాలం నవీద్‌ నివాసం
  • మన్సూర్‌ ఫీర్‌భాయ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ నేర్చింది సిటీలోనే..

దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా.. మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటాయి..! ఎవరు అవునన్నా.. కాదన్నా.. పదేళ్ల క్రితం వరకు ఇది నిజం. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు అప్పట్లో నగరానికి క్యూ కట్టేవి. ప్రస్తుతం శాంతిభద్రతల పరిరక్షణలో నగరం ఎంతో ముందంజలో ఉన్నా.. గతంలో మాత్రం స్లీపర్‌సెల్స్‌, ముష్కరులకు అడ్డాగా ఉండేది. తాజాగా గుజరాత్‌లోని స్పెషల్‌ కోర్టు అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో తీర్పునిచ్చిన నేపథ్యంలో.. మరణ శిక్ష పడ్డవారిలో కొందరికి హైదరాబాద్‌తో సంబంధాలున్నాయి. - (సెంట్రల్‌ డెస్క్‌)


అబూ బషీర్‌ ఇస్లాహీ..

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో గుజరాత్‌ పోలీసులు తొట్టతొలిగా అరెస్టు చేసింది ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన అబూ బషీర్‌నే. ఇతని అరెస్టు తర్వాతే ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) అగ్రనేతలు పట్టుబడ్డారు. ఆ నెట్‌వర్క్‌ డొంక కదిలింది. అయితే.. అబూ బషీర్‌ చాలాకాలం హైదరాబాద్‌లో మకాం వేశాడు. శివార్లలోని పహాడీషరీఫ్‌లో ఉన్న ఓ మదర్సాలో 2005-07 మధ్యకాలంలో టీచర్‌గా పనిచేశాడు. 2007 ఆగస్టు 25న గోకుల్‌ చాట్‌, లుంబినీ పార్క్‌ పేలుళ్ల తర్వాత అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ‘నిషాన్‌-ఏ-రాహ్‌’ అనే ఉర్దూ పత్రికకు ఇతను సంపాదకుడిగా వ్యవహరించినట్లు అప్పట్లో హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. గుజరాత్‌ పోలీసులు ఇతనితోపాటు.. అబ్దుల్‌ రషీద్‌ ముస్తాక్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. రషీద్‌ నిర్దోషి అని కోర్టు తేల్చింది. నిజానికి అబూ బషీర్‌పై హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. గోపాలపురం కుట్ర కేసులోనూ అబ్దుల్‌ సత్తార్‌ అనే నిందితుడు మొదటిసారి అబూ బషీర్‌ పేరును ప్రస్తావించాడు. అబూ బషీర్‌పైనా కేసు నమోదైంది. వీరంతా అప్పట్లో ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ త్రివేదీ హత్యకు కుట్రపన్నారని పోలీసులు అభియోగాలు మోపారు. కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన పలువురు ఉగ్ర అనుమానితులు కూడా అబూ బషీర్‌ పేరును ప్రస్తావించినా.. అప్పట్లో పోలీసులు అతనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.


నగోరీ సోదరులు..

మధ్యప్రదేశ్‌కు చెందిన కరడుగట్టిన సిమీ ఉగ్రవాద సోదరులు సఫ్దార్‌ నగోరీ, కమ్రుద్దీన్‌ నగోరీలకు గుజరాత్‌ కోర్టు మరణశిక్ష విధించింది. వీరిద్దరూ పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చి, వెళ్లారు. 2009-10 మధ్య కాలంలో బెంగళూరు పోలీసులు హైదరాబాద్‌లోని షాతంరాయి, ఓల్డ్‌సిటీ బండ్లగూడ ప్రాంతాల నుంచి కేరళలోని కన్నూరుకు చెందిన తోడల్లుళ్లు అబ్దుల్‌ సత్తార్‌, అబ్దుల్‌ జబ్బార్‌ను అరెస్టు చేశారు. వీరి మరో తోడల్లుడు టి.నసీర్‌ను బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌ వద్ద ఇంటర్‌పోల్‌ అరెస్టు చేసి, భారత్‌కు అప్పగించింది. వీరిలో అబ్దుల్‌ సత్తారు ఐఈడీల తయారీలో దిట్ట. 


బెంగళూరు పేలుళ్లలో ఇతనే కీలక నిందితుడు. ఇతడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో సఫ్దార్‌ నగోరీ, కమ్రుద్దీన్‌ నగోరీలు తనను కలవడానికి హైదరాబాద్‌ వచ్చినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. ఇండియన్‌ ముజాహిదీన్‌ మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్‌ కూడా ఇతణ్ని హైదరాబాద్‌లో కలిసినట్లు వివరించారు. అబ్దుల్‌ సత్తార్‌ కుమారుడు తయారు చేసిన అరటిదొన్నెల రూపంలో ఉండే ఐఈడీలను సూరత్‌కు పంపారని, అతడికి అనుభవం లేకపోవడం వల్ల చేసిన పొరపాట్లతో.. ఆ బాంబులు పేలలేదని అప్పట్లో బెంగళూరు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. అదే సమాచారాన్ని గుజరాత్‌ పోలీసులకు చేరవేశాయి. మరో దోషి సర్వుద్దీన్‌ ఈటీది  హైదరాబాద్‌ కావడం గమనార్హం.


నవీద్‌..

అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో ఇతను కూడా కీలక నిందితుడే. ఇతడు మెహిదీపట్నంలో కొంతకాలం తలదాచుకున్నాడు. గుజరాత్‌ పోలీసులు ఇతణ్ని హైదరాబాద్‌ నుంచి అరెస్టు చేశారు. మనోవైకల్యం కారణంగా ఈ కేసులో ఇతనికి మాత్రమే తాత్కాలిక బెయిల్‌ లభించింది. మిగతా వారంతా అరెస్టయినప్పటి నుంచి జైళ్లలోనే ఉన్నారు. నవీద్‌తో పాటు మరో ఇద్దరు దోషులు కూడా ఇక్కడే అరెస్టయ్యారు.


మన్సూర్‌ పీర్‌భాయ్‌..

అహ్మదాబాద్‌ పేలుళ్లలో మన్సూర్‌ పీర్‌భాయ్‌ ప్రమేయాన్ని పేర్కొనకున్నా.. ఆ తర్వాత ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడు. పేలుళ్లకు ముందు మీడియాకు ఈ-మెయిల్‌ ద్వారా హెచ్చరికలు పంపింది ఇతనేనని పోలీసులు గుర్తించారు. అమెరికాలో.. యాహూ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకున్న ఇతను ఐఎం కోసం పనిచేశాడు. వైఫై నెట్‌వర్క్‌లను హ్యాక్‌ చేసి, మీడియాకు ఈ-మెయిల్స్‌ పంపేవాడు. ఇతను ఎథికల్‌ హ్యాకింగ్‌ నేర్చుకుంది ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో కావడం గమనార్హం..! అంతేకాదు..! ఇతను ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సును అభ్యసిస్తున్నప్పుడు.. అప్పటి సీఐడీ సైబర్‌ సెల్‌ అధికారి ఒకరు ఇతనికి సహాధ్యాయి..! అయితే.. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసేదాకా.. మన్సూర్‌ పీర్‌భాయ్‌ ఐఎం ఉగ్రవాది అనే విషయం బయటకు రాలేదు.

Updated Date - 2022-02-19T14:31:22+05:30 IST