పనిలేని సంస్థ కోసం ఉన్నత పదవి!

ABN , First Publish Date - 2022-12-30T03:27:47+05:30 IST

అది పని లేని సంస్థ! పాతికేళ్ల క్రితమే ప్రాభవం కోల్పోయిన సంస్థ! రెండేళ్ల క్రితమే ఆ సంస్థ పరిధిలోని ఎత్తిపోతలన్నీ (లిఫ్టులు) చీఫ్‌ ఇంజనీర్ల (సీఈ)ల కిందకు తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పనిలేని సంస్థ కోసం ఉన్నత పదవి!

ఐడీసీ చైర్మన్‌గా వేణుగోపాలచారి నియామకం.. పాతికేళ్ల క్రితమే ప్రాభవం కోల్పోయిన సంస్థ

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అది పని లేని సంస్థ! పాతికేళ్ల క్రితమే ప్రాభవం కోల్పోయిన సంస్థ! రెండేళ్ల క్రితమే ఆ సంస్థ పరిధిలోని ఎత్తిపోతలన్నీ (లిఫ్టులు) చీఫ్‌ ఇంజనీర్ల (సీఈ)ల కిందకు తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్యాలయం పరిధిలో ఏమీ పనుల్లేవు! సంస్థలో ఓ ఐదుగురు ఉద్యోగులుంటారు. వారి జీతాలకు సంబంధించిన ఫైలొకటి నెలకోసారి కదులుతుంది.. అంతే! పనిలేక.. పైసల్లేక అలంకార ప్రాయంగా ఉన్న ఆ కార్యాలయాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకు? అని ఇటీవలే బహుళ జాతి సంస్థలకు అద్దెకు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు టెండర్లు కూడా ఆహ్వానించింది. అయితే అలాంటి సంస్థకు ప్రభుత్వం తాజాగా చైర్మన్‌ను నియమించింది. అదే.. ఉమ్మడి రాష్ట్రంలో 1974లో ఏర్పాటైన సాగునీటి అభివృద్ధి సంస్థ (ఐడీసీ). ఈ సంస్థకు చైర్మన్‌గా ఆదిలాబాద్‌కు చెందిన మాజీ ఎంపీ వేణుగోపాలాచారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారని సర్కారు పేర్కొంది. కొండ, ఎగువ ప్రాంతాలు, సాగునీటి వసతి లేని చివరి ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా ఐడీసిని ఏర్పాటు చేశారు. 1974లో 637 మినీ ఎత్తిపోతల పథకాలను అప్పటి సర్కారు చేపట్టింది.

క నిష్ఠంగా 100 ఎకరాలు, గరిష్ఠంగా 10 వేల ఎకరాల దాకా భూములకు నీరందించేలా ప్రధాన ప్రాజెక్టుల కింద వీటిని కట్టారు. 1974 నుంచి 1995 దాకా ఈ లిఫ్టులన్నీ ఐడీసీ కింద ఉండేవి. ఫలితంగా వాటి నిర్వహణ, మరమ్మతులనూ ఐడీసీనే చూసేది. రాష్ట్రంలో మొత్తం 637 ఐడీసీ లిఫ్టులు ఉండగా... అందులో 216 మాత్రమే పనిచేస్తున్నాయి. పాక్షికంగా పనిచేస్తున్నవి 137 మాత్రమే! 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం జరగడం, కాలువల ద్వారా నీరు వెళుతుండటంతో 91 లిఫ్టులు అవసరం లేదని నిర్ణయించి తాళాలు వేశారు. దాంతో మొత్తంగా 284 లిఫ్టులకు తాళం పడినట్లయింది. ఈ క్రమంలో ఏ మాత్రం పని లేని సంస్థకు చైర్మన్‌ను కట్టబెట్టడం వెనుక మర్మం ఏమిటి? అని నిపుణులు ముక్కునవేలేసుకుంటున్నారు.

1995లోనే గడ్డుకాలం

1974లో ఈ లిఫ్టుల నిర్మాణం ప్రారంభం కాగా 1995 దాకా ఐడీసీ నిర్వహణలోనే వీటిని ఉంచారు. ఆ తర్వాత ప్రపంచబ్యాంకు సంస్కరణల్లో భాగంగా 1995లో వీటిని సాగునీటి వినియోగ సంఘాల నిర్వహణలోకి తెచ్చారు. రైతులే సభ్యులుగా ఉండేలా వాటర్‌ యూజర్‌ అసోసియేషన్‌ వీటి నిర్వహణ చూసేది. పెద్ద మరమ్మతులు వస్తేనే ఐడీసీ రంగంలోకి దిగేది. ప్రస్తుతం లిఫ్టులనే ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తుండటంతో ఐడీసీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఒక సీఈ స్థాయి అధికారి, నలుగురు దాకా ఉద్యోగులు మాత్రమే ఉండగా కొత్తగా చైర్మన్‌ రానున్నారు. చైర్మన్‌గా వేణుగోపాలాచారి బాధ్యతలు చేపట్టగానే భవనం, వాహనం, సిబ్బందిని కేటాయించి ఇతర సదుపాయాలను కల్పించాలని సాగునీటి పారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2022-12-30T03:27:47+05:30 IST

Read more