క్రికెట్‌ జోష్‌..ఇండియా గెలుపుతో అంబరాన్నంటిన సంబరాలు

ABN , First Publish Date - 2022-09-26T15:28:55+05:30 IST

మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహా నగరంలో జరిగిన టీ 20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా ఆనందోత్సవాలు మిన్నంటాయి.

క్రికెట్‌ జోష్‌..ఇండియా గెలుపుతో అంబరాన్నంటిన సంబరాలు

పోలీసుల అధీనంలో ఉప్పల్‌ స్టేడియం 

మూడంచెల భద్రత నడుమ టీ-20 మ్యాచ్‌


హైదరాబాద్‌ సిటీ: మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహా నగరంలో జరిగిన టీ 20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా ఆనందోత్సవాలు మిన్నంటాయి. అభిమానుల్లో అంతులేని జోష్‌ నెలకొంది. అంతకు ముందు వేలాది మంది క్రికెట్‌ లవర్స్‌తో ఉప్పల్‌ స్టేడియం కోలాహలంగా కనిపించింది. 15 రోజులుగా టికెట్ల కోసం అభిమానులు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. లాఠీచార్జిని  కూడా చవి చూశారు. ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ కావడం, చాలా విరామం తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో ఆదివారం ఉదయం నుంచే ఉప్పల్‌ స్టేడియంలో అభిమానుల సందడి కనిపించింది. రసవత్తరంగా సాగిన ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్‌ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో గెలుపెవరిదోనన్న ఆందోళనలో ఉన్న నగర వాసులకు 5వ బంతితో ఇండియా విజయం సాధించడం ఉప్పల్‌ స్టేడియం చప్పట్లు.. జయహో కేకలతో దద్దరిల్లింది. 


అడుగడుగునా నిఘా..

టి-20 క్రికెట్‌ మ్యాచ్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి రాచకొండ పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 2500ల మంది పోలీసులతో మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తం సీసీటీవీ కెమెరాల నిఘా నీడలో ఉంచారు. 


సీపీ ప్రత్యక్ష పర్యవేక్షణ..

ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌ భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ స్వయంగా పర్యవేక్షించారు. వారం రోజుల ముందునుంచే సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తూ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. పార్కింగ్‌ విషయంలోనూ ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.


జోరుగా బెట్టింగ్‌లు

టీ-20 మ్యాచ్‌ బెట్టింగ్‌ రాయుళ్లకూ సంబరాన్నిచ్చింది. బుకీలు రెండు రోజుల నుంచే పందాలకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్‌ కావడంతో స్కోర్లపై భారీగా బెట్టింగ్‌ జరిగినట్లు అంచనా. ఈ నేపథ్యంలో గతంలో చిక్కిన బుకీలు, వారి స్థావరాలపై పోలీసులు ఆదివారం ఉదయం నుంచే కన్నేసి ఉంచారు. ఎంత మందిని గుర్తించారు, ఎక్కడెక్కడ బెట్టింగ్‌ జరిగిందన్న విషయాలు ఆదివారం రాత్రికి ఇంకా వెలుగులోకి రాలేదు. 


అభిమాన ‘దారులు’

క్రికెట్‌ అభిమానులతో ఉప్పల్‌ రోడ్లన్నీ నిండిపోయాయి. స్టేడియం పరిసరాలు జన సంద్రంగా మారాయి. క్రికెట్‌ అభిమానులు ఉప్పల్‌కు భారీగా తరలివచ్చారు. హబ్సిగూడ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.


చివరి నిమిషంలోనైనా..

ఆటలో గెలుపు కోసం క్రికెటర్లు చివరి వరకూ పోరాడతారు. అలాగే ఆట టికెట్‌ కోసం అభిమానులు చివరి నిమిషం వరకూ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇండియా-ఆస్ట్రేలియా టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్‌ కోసం పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా ప్రయత్నించారు. టికెట్‌ మిగిలితే ఎవరైనా తమకు విక్రయిస్తారన్న ఆశతో సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ ముందు చాలా మంది నిరీక్షించారు. సాయంత్రం 5 గంటల సమయంలో మ్యాచ్‌ ఆడేందుకు ఇరు జట్ల క్రీడాకారులు బస్సులో ఇదే మార్గంలో వెళ్తుండగా, పక్కనే ఉన్న ఫ్లై ఓవర్‌ వద్ద నిల్చుని టాటా చెబుతూ మురిసిపోయారు.

Read more