ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల పార్ట్‌-2కు దరఖాస్తు చేయని 43,920 మంది

ABN , First Publish Date - 2022-11-12T03:59:11+05:30 IST

పోలీస్‌ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించి కూడా పెద్దసంఖ్యలో అభ్యర్థులు రెండోదశ (పార్ట్‌-2)కు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయలేదు.

ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల పార్ట్‌-2కు దరఖాస్తు చేయని 43,920 మంది

ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించినా 17,856 మంది దూరం

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించి కూడా పెద్దసంఖ్యలో అభ్యర్థులు రెండోదశ (పార్ట్‌-2)కు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయలేదు. ఏకంగా 43,920 మంది అభ్యర్థులు రెండో దశ ఎంపిక ప్రక్రియకు దరఖాస్తు చేయకుండా ఉండిపోయారు. ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఈ ఏడాది ఆగస్టులో ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించిన నియామక బోర్డు.. అక్టోబరు 21న ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి రెండో దశ ఎంపిక ప్రక్రియకుగాను అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకు పార్ట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు ఎస్సై (సివిల్‌), తదితర విభాగాలు, కానిస్టేబుల్‌ (సివిల్‌), తదితర విభాగాలు, ఎక్సైజ్‌, రవాణా విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 4,18,722 మంది అభ్యర్థులు పార్ట్‌-2కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

కానీ, వీరిలో 4,00,866 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 17,856 మంది దరఖాస్తుకు దూరంగా ఉండిపోయారు. మరోవైపు టెక్నికల్‌ విభాగంలో ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు మొదటి దశలో దరఖాస్తు చేసిన 89,168 మంది అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వీరిలో 63,104 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 26,064 మంది దరఖాస్తు చేయలేదు. టెక్నికల్‌ పోస్టులకు పార్ట్‌-2 దరఖాస్తులు 71 శాతం మాత్రమే వచ్చాయని పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. కొందరు అభ్యర్థులు పార్ట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తులో స్వల్ప తప్పిదాలు చేసినట్లు గుర్తించామన్నారు. దరఖాస్తులో తప్పిదాలు సరిదిద్దుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ కల్పిస్తామని చెప్పారు.

25 రోజుల్లో శరీర దారుఢ్య పరీక్షలు పూర్తి...

ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రెండో దశలో నిర్వహించే శరీర దారుఢ్య పరీక్షలు త్వరలో చేపడతామని నియామక బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో 12 మైదానాల్లో దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరాన్ని బట్టి ఒకటి, రెండు మైదానాలను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. శరీర దారుఢ్య పరీక్షల ప్రక్రియ చేపట్టిన తర్వాత 25 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దారుఢ్య పరీక్షల తేదీలు, గ్రౌండ్‌ వివరాలు అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు.

Updated Date - 2022-11-12T03:59:11+05:30 IST

Read more