వత్తులు, బొట్టు బిళ్లల పేరుతో 200 కోట్లకు టోకరా

ABN , First Publish Date - 2022-11-29T02:14:23+05:30 IST

దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ..

వత్తులు, బొట్టు బిళ్లల పేరుతో 200 కోట్లకు టోకరా

వందల మందికి వత్తుల మిషన్లు అంటగట్టి

డిపాజిట్లు సేకరించి ఉడాయించిన కేటుగాడు

హైదరాబాద్‌లో ఘరానా మోసం

ఏఎస్‌రావు నగర్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ... అదీ వర్క్‌ ఫ్రం హోం పద్ధతిలో అంటూ ఎరవేసి పేద, మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులను ఓ కేటుగాడు నిలువునా మోసగించాడు. వత్తుల తయారీ మిషన్లు అంటగట్టి, వందలాది మంది నుంచి డిపాజిట్ల పేరుతో ఆ వ్యక్తి కొల్లగొట్టిన సొమ్ము రూ.200 కోట్లు ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా. ఈ భారీ మోసం హైదరాబాద్‌ ఏఎ్‌సరావు నగర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా రేచర్లకు చెందిన రావులకొల్లు రమేశ్‌(30) అనే వ్యక్తి ఏడాది క్రితం ఏఎస్‌ రావు నగర్‌ అన్నపూర్ణ ఆర్కేడ్‌ అపార్టుమెంట్‌లో ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో వత్తులు, బొట్టు బిళ్లల తయారీ సంస్థను ప్రారంభించాడు. నిరుద్యోగ యువత, మహిళలు ఇంటి వద్దే ఉండి పనిచేసుకోవచ్చంటూ యూట్యూబ్‌లో ప్రచారం చేశాడు. అనేక మంది ఆకర్షితులై చేరగా... వారికి రెండు రకాల వత్తుల తయారీ యంత్రాలను విక్రయించాడు. ఒక్కో యంత్రానికి రూ.1.20 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు వసూలు చేశాడు. వత్తుల తయారీకి వాడే కాటన్‌ను కూడా అతనే సరఫరా చేశాడు.

వత్తులు చేసి ఇస్తే కిలోకు రూ.300 చొప్పున చెల్లించేలా ఒప్పందం కదుర్చుకున్నాడు. ఇలా కొన్ని నెలల పాటు వ్యాపారం నడిచింది. దీంతో చైన్‌ లింక్‌తో పెద్ద సంఖ్యలో ప్రజలు చేరారు. ఇదే అదునుగా భావించిన రమేష్‌ భారీ మోసానికి తెరతీశాడు. గత మూడు నెలల నుంచి వత్తుల తయారీదార్లకు డబ్బులు చెల్లించడం లేదు. అదిగో.. ఇదిగో అంటూ ఆలస్యం చేస్తున్నాడు. దీంతో విసుగుచెందిన పలువురు బాధితులు కార్యాలయానికి వచ్చి నిలదీయడం మొదలుపెట్టారు. రోజురోజుకు ఒత్తిడి పెరగడంతో రమేష్‌ బిచాణా ఎత్తేశాడు. సోమవారం సుమారు 30 మంది బాధితులు ఆఫీసుకు రాగా అక్కడ ఎవరూ లేకపోవడంతో కంగుతిన్నారు. రమేష్‌, సిబ్బంది ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయి ఉండడంతో మోసపోయామని గ్రహించారు. రమేష్‌ మాయమాటలు నమ్మి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 1,100 మంది బాధితులు రూ.లక్షల్లో డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుపై రమే్‌షతో పాటు అతనికి సహకరించిన సుధాకర్‌, రామారావు, అర్షద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-11-29T09:37:49+05:30 IST