ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనుల్లో..20 శాతం ఇతరుల భాగస్వామ్యం

ABN , First Publish Date - 2022-12-10T02:58:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనుల్లో రెండు సంస్థలు భాగస్వాములు కానున్నాయి.

ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనుల్లో..20 శాతం ఇతరుల భాగస్వామ్యం

ముందుకొచ్చిన జీఎంఆర్‌ సంస్థ, హెచ్‌ఎండీఏ

625 కోట్ల చొప్పున ప్రభుత్వానికి చెక్కులు

నిర్మాణం వేగిరం అయ్యేందుకు అవకాశం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనుల్లో రెండు సంస్థలు భాగస్వాములు కానున్నాయి. రాయదుర్గం రహేజా మైండ్‌ స్పేస్‌ కూడలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర రూ.6,250 కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌, హెచ్‌ఎండీఏ పాలుపంచుకోనున్నాయి. రాయదుర్గం వద్ద శుక్రవారం పనులకు శంకుస్థాపన అనంతరం తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు చల్లా ప్రసన్నరెడ్డి, కిశోర్‌కుమార్‌లు 10 శాతం వాటా కింద రూ.625 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందజేశారు. హెచ్‌ఎండీఏ తరపున కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ సైతం రూ.625 కోట్ల చెక్కును ఇచ్చారు. కాగా, 31 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఎయిర్‌పోర్టు మెట్రో మొత్తం వ్యయం రూ.6,250 కోట్లలో ఈ రెండు సంస్థలు రూ.1,250 కోట్లు ముందుగానే చెల్లించడంతో పనుల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మిగతా 80ు నిధులను సొంతంగా సమకూర్చనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు ఇతర సంస్థలను ఆహ్వానిస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా, మెట్రో మొదటి దశలో కిలోమీటరుకు ఒక స్టేషన్‌ను నిర్మించారు. ప్రస్తుత ఎయిర్‌పోర్టు మెట్రోలో 5 కిలోమీటర్లకు ఒక స్టేషన్‌ను నిర్మించే విధంగా డిజైన్‌ చేశారు.

అందుకే డీపీఆర్‌ను వెల్లడించడం లేదు

మొదటి దశలో ఎల్బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గం కారిడార్లలో చేపట్టిన పనులకు అంతరాయాలు తలెత్తాయి. ప్రధాన రహదారులపై పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణ సమయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. ఇవి ఇంకా నడుస్తున్నట్లు తెలిసింది. మరోవైపు 2012లో ప్రారంభించిన మెట్రో తొలి విడత పనులు 2017లో పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు మెట్రో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను ఇప్పుడే బహిర్గతం చేస్తే.. ఆస్తులకు నష్టం వాటిల్లనుందంటూ చాలామంది కోర్టులకు వెళ్లే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అందుకనే డీపీఆర్‌ను బయటకు వెల్లడించడంలేదని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-12-10T02:58:21+05:30 IST