TS News: సమైక్య స్ఫూర్తితో యావత్ దేశాన్నీ సంఘటితపరుస్తున్న మోదీ: విజయశాంతి

ABN , First Publish Date - 2022-09-17T23:47:11+05:30 IST

రెండు శతాబ్దాలకుపైగా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రానికి విముక్తి లభించిన రోజు. రజాకార్లు, భూస్వాముల

TS News: సమైక్య స్ఫూర్తితో యావత్ దేశాన్నీ సంఘటితపరుస్తున్న మోదీ: విజయశాంతి

హైదరాబాద్: సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలని కొన్ని దశాబ్దాల నుంచీ బీజేపీ పోరాడుతోంది. ఆ రోజున హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని కలెక్టరేట్లపై జాతీయ జెండా ఆవిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే కాకుండా గతంలో సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచీ ఆ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతి ఏటా సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో సచివాలయం, జిల్లాల్లో కలెక్టరేట్లపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ముట్టడి కార్యక్రమాలను నిర్వహించేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చేస్తామన్న ప్రకటన తమ ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిందని బీజేపీ నేతలు అంటున్నారు. సెప్టెంబరు 17 ప్రాధాన్యతను బీజేపీ నేత విజయశాంతి వివరించారు.

‘‘ప్రజల రక్తం తాగిన రాక్షస రజాకార్ల కీలుబొమ్మ... నిరంకుశ నిజాం పాలనపై కొట్లాడి 75 ఏళ్ల కిందట హైదరాబాద్ (Hyderabad) సంస్థానాన్ని విడిపించుకున్నాం. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Vallabhbhai Patel) గారి ఆదేశాలతో జరిగిన ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు బానిస జీవితాల నుంచి విముక్తులై ఈ సందర్భాన్ని ప్రతి ఏటా విమోచన దినోత్సవంగా చేసుకుంటున్నారు. కానీ, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం దీనిని జాతీయ సమైక్యతా దినం అంటున్నారు. ఒకప్పటి నిజాం రాజ్యంలో భాగమై ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాల వారు సైతం సెప్టెంబర్ 17ను విమోచన దినంగానే పాటిస్తూంటే... ఇన్నాళ్లూ తన సయామీ కవల పార్టీ ఎంఐఎం భయంతో ఆ తేదీని తల్చుకోవడానికే వణికిపోయిన టీఆర్‌ఎస్ అధినేత, ఇప్పుడు కిందా మీదా పడి దీనికి సమైక్యతా దినం అని కొత్తపేరు పెట్టారు. అయితే, నిజాం సమాధికి వంగి వంగి నమస్కారం పెట్టిన కేసీఆర్... సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా వర్ణించడం వెనుక కేసీఆర్ కూడా ఊహించని...  వారికి నచ్చని ఒక  సత్యం కనిపిస్తోంది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ ఆసేతుహిమాచలాన్నీ ఏకతాటిపై నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టింది కూడా ఇదే రోజున. ఒక సమైక్య స్ఫూర్తితో యావత్ దేశాన్నీ సంఘటితపరుస్తున్న ప్రధాని పుట్టినరోజునే హైదరాబాద్ సంస్థానం కూడా ఇండియన్ యూనియన్‌లో ఐక్యమైనందున తెలిసో తెలియకో... మోడీ గారి జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా  భావించాలని కేసీఆర్‌ నోట ఆ దైవం అనిపించి ఉండవచ్చు. బహుశా హైందవ ద్రోహికి ఇదొక చిన్న పాపపరిహారం’’ అని విజయశాంతి సోషల్ మీడియాలో దుయ్యబట్టారు.

Updated Date - 2022-09-17T23:47:11+05:30 IST