గల్ఫ్‌ నుంచి తెలంగాణకు భారీగా నిధులు!

ABN , First Publish Date - 2022-09-27T09:03:55+05:30 IST

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.

గల్ఫ్‌ నుంచి తెలంగాణకు భారీగా నిధులు!

  • హవాలా మార్గంలో చేరినట్లు గుర్తింపు.. 
  • ఆ నిధులు ఏం చేశారు? ఎక్కడికి వెళ్లాయి?
  • పీఎఫ్‌ఐ కేసులో నిధుల మళ్లింపుపై ఈడీ దృష్టి
  • గల్ఫ్‌ దేశాల్లో వేలాదిగా క్రియాశీల సభ్యులు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. విదేశాల నుంచి పీఎ్‌ఫఐకి పెద్దమొత్తంలో నిధులు అందాయంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగాలు మోపిన నేపథ్యంలో.. ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, దేశంపై కుట్ర చేశారన్న అభియోగాలపై గత వారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఐఏ.. 45 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలోనే దేశంలో పీఎ్‌ఫఐ కార్యకలాపాలకు రూ.100 కోట్లకుపైగా నిధులు సమకూరాయని ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. దీంతో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. తెలంగాణకు కూడా గల్ఫ్‌ దేశాల నుంచి హవాలా మార్గంలో భారీగా నిధులు వచ్చినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. 


విదేశాల నుంచి వచ్చిన నిధులు ఏం చేశారు, ఎలా ఖర్చు చేశారనే కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన నిందితుల్ని విచారించడం ద్వారా నిధులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పీఎ్‌ఫఐ కార్యకలాపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కేసులు నమోదవగా అందులో తాజాగా నమోదైన కేసు తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిందే. నిజామాబాద్‌, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న పీఎ్‌ఫఐకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులతోపాటు పీఎ్‌ఫఐకి సంబంధించిన నాయకులు, శిక్షణ పొందిన వారు అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించి వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. అరెస్టయిన పీఎ్‌ఫఐ నాయకులు, సానుభూతి పరుల బ్యాంకు ఖాతాల్లో నగదు లావాదేవీలను ఈడీ బృందాలు పరిశీలిస్తున్నాయి. గత వారం ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసిన అబ్దుల్‌ వారి్‌సతోపాటు ఇదివరకే అరెస్టయిన నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్‌ ఖాదర్‌తోపాటు యాసిన్‌ సమీర్‌, ఫిరోజ్‌ఖాన్‌, మహ్మద్‌ ఉస్మాన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ను కస్టడీకి తీసుకుని విచారించనుంది. తద్వారా విదేశీ విరాళాలకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్‌ఐఏ, ఈడీ బృందాలు సిద్ధమవుతున్నాయి.

 

కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ..

హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో గత వారం ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఆ సమయంలో తమ ఎదుట విచారణకు హాజరవ్వాలని కొందరు అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. వారు మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారు. పాతబస్తీలో సీజ్‌ చేసిన పీఎ్‌ఫఐ కార్యాలయ నిర్వాహకులు కూడా విచారణకు హాజరయ్యారు. కార్యాలయ నిర్వహణ, నిధులు, కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్న వారికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. తనిఖీల్లో లభించిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత విచారణ అనంతరం మరికొందర్ని అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలిసింది.


హవాలా లావాదేవీలకు ‘దర్బార్‌’!

గల్ప్‌ దేశాల్లో పీఎఫ్‌కి వేలాది మంది క్రియాశీల సభ్యులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. అక్కడ భారీగా నిధులు సేకరించి, వాటిని హవాలా మార్గంలో భారత్‌కు పంపుతున్నట్లు తెలిపింది. పీఎఫ్‌ఐ మాత్రం తమకు భారత్‌లో నగదు రూపంలోనే రూ.120 కోట్ల విరాళాలు అందినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ సొమ్ములో అత్యధిక మొత్తానికి నకిలీ రశీదులు చూపారని తెలిపింది. తేజస్‌ వార్తా పత్రిక పీఎఫ్‌ఐకి సొంత పత్రిక అని.. భారత్‌, గల్ఫ్‌లో నిధుల సేకరణకు దోహదపడుతోందని తెలిపింది. కానీ, పీఎఫ్‌ఐ మాత్రం నకిలీ విరాళాల రశీదులతో భారత్‌లో ప్రభుత్వ సంస్థలను తప్పుదోవ పట్టిస్తోందని వివరించింది. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన పీఎ్‌ఫఐ సభ్యుల్లో చాలా మంది అబుధాబిలోని దర్బార్‌ రెస్టారెంట్‌ను తమ హవాలా లావాదేవీలకు కేంద్రంగా వాడుకున్నారని ఈడీ వెల్లడించింది. ఈ రెస్టారెంట్‌ నుంచే భారత్‌కు అక్రమంగా నిధులు పంపేవారని తెలిపింది. ఇప్పటికే అరెస్టు చేసిన అబ్దుల్‌ రజాక్‌.. పీఎఫ్‌ఐకి సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారాలు చూసుకునేవాడని పేర్కొంది. భారీస్థాయిలో నిధులు సేకరించడం, వాటిని హవాలా మార్గంలో భారత్‌కు పంపించడంలో ఎంకే ఆష్రా్‌ఫది కీలకపాత్ర అని తెలిపింది. అతను పీఎ్‌ఫఐ కేరళ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడని, ఎర్నాకుళం పీఎ్‌ఫఐ అధ్యక్షుడిగానూ పని చేశాడని వివరించింది. 

Read more