రామలింగేశ్వరా చేరేదెలా?

ABN , First Publish Date - 2022-11-23T00:45:08+05:30 IST

ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం గుట్టపైకి రెండో ఘాట్‌రోడ్‌ లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెర్వుగట్టు గుట్టపైకి మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్‌ ఉంది. చెర్వుగట్టుకు వాహనాల్లో వచ్చే భక్తులు ఈ ఘాట్‌ రోడ్డును వినియోగిస్తారు.

రామలింగేశ్వరా చేరేదెలా?

భక్తులు అధిక సంఖ్యలో వస్తే ఘాట్‌రోడ్‌లో ట్రాఫిక్‌జాం

రెండో ఘాట్‌రోడ్‌ లేక ఇక్కట్లు

నార్కట్‌పల్లి, నవంబరు 22: ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం గుట్టపైకి రెండో ఘాట్‌రోడ్‌ లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెర్వుగట్టు గుట్టపైకి మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్‌ ఉంది. చెర్వుగట్టుకు వాహనాల్లో వచ్చే భక్తులు ఈ ఘాట్‌ రోడ్డును వినియోగిస్తారు. కాలినడకన వచ్చే భక్తు లు మెట్ల మార్గం ద్వారా వస్తుంటారు. ప్రతీ అమావాస్య, ఇతర పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లోనే తరలివస్తున్నారు.

గుట్టపైకి సింగిల్‌ ఘాట్‌రోడ్డు మాత్రమే ఉంది. దీంతో గుట్టపైకి వెళ్లే, తిరిగి వచ్చే వాహనాలు ఈ ఘాట్‌ రోడ్డు మీదుగానే రావాల్సి వస్తోంది. వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తుండటంతో, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది లేకపోవడంతో రద్దీ సమయంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో వాహనదారులు గంటల కొద్దీట్రాఫిక్‌లో ఇరుక్కొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కనీసం రద్దీ సమయాల్లో ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచిపోకుండా వాహనాలను క్రమబద్ధీకరించేందుకు సిబ్బందిని ఏర్పా టు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. అంతేగాక రెండో ఘాట్‌రోడ్‌ నిర్మిస్తే అసలు ఈ సమస్యే ఉండదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించాలి : సైదుగాని స్వామి, భక్తుడు

చెర్వుగట్టు గుట్టపైకి రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించాలి. పర్వదినాల్లో , ఉత్సవాల సమయంలో దేవస్థానానికి దూరం నుంచి సొంత వాహనాల్లో వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్ర సందర్శనకు వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా రెండో ఘాట్‌ రోడ్డును నిర్మించాలి. అప్పటిలోగా కనీసం సిబ్బందిని నియమించి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా చర్యలు తీసుకోవాలి.

రెండో ఘాట్‌రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపాం : అరుణారాజిరెడ్డి, దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్‌

చెర్వుగట్టు క్షేత్రంపైకి రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించేందుకు ట్రస్ట్‌ బోర్డు చేసి న తీర్మానాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ద్వా రా ప్రభుత్వానికి పంపాం. అ సెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రస్తావించారు. జిల్లాలో అతి పెద్ద క్షేత్రమైన చెర్వుగట్టుకు వస్తున్న భక్తుల సంఖ్యను గుర్తించి రెండో ఘాట్‌రోడ్డు నిర్మించాలని దేవదా యశాఖ మంత్రిని శాసనసభ సమావేశాల్లో కోరారు. త్వరలో మంజూరవుతుందని ఆశిస్తున్నాం.

సిబ్బంది కొరత ఉంది : సిరికొండ నవీన్‌కుమార్‌, ఈవో

పలు పర్వదినాలు, ఉత్సవాల సమయంలో ఘాట్‌రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తి ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. రెండో ఘాట్‌రోడ్డు ఏర్పాటుతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ ఘాట్‌రోడ్డుపై ఏర్పడుతున్న ట్రాఫిక్‌తో పాటు భక్తులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొర త ఉంది. ప్రస్తుతం నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా, వీరిలో ఇద్దరు చొప్పున పగలు, రాత్రి పూట విధులు నిర్వహిస్తున్నారు. అదనపు సిబ్బంది కోసం కమిషనర్‌ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

Updated Date - 2022-11-23T00:45:08+05:30 IST

Read more