స్వాతంత్య్ర వేడుకల్లో గర్వంగా ఎలా పాల్గొంటాం: మందకృష్ణ మాదిగ

ABN , First Publish Date - 2022-08-16T09:51:21+05:30 IST

స్వాతంత్య్ర వేడుకల్లో తాము గర్వంగా ఎలా పాల్గొంటామని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.

స్వాతంత్య్ర వేడుకల్లో గర్వంగా ఎలా పాల్గొంటాం: మందకృష్ణ మాదిగ

న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకల్లో తాము గర్వంగా ఎలా పాల్గొంటామని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా ఇంకా అంటరానితనం నిర్మూలన కాలేదని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ పరిసరాల్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో.. రాజస్థాన్‌లో కుల రక్కసికి బలైపోయిన దళిత చిన్నారి ఇంద్ర కుమార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఇంద్రకుమార్‌ మరణం దళితుల హృదయాలను కలచివేసిందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో దళితుల పాత్ర తిరుగులేనిదని.. అందుకు అంబేడ్కర్‌, బాబు జగజ్జీవన్‌ రామ్‌ వంటి వాళ్లే ఉదాహరణని పేర్కొన్నారు. ఇంద్రకుమార్‌ మృతి ఘటన ప్రధాని మోదీ దృష్టికి వెళ్లినా స్పందన లేదని.. విషయాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి ఈ నెల 22 వరకు జాతీయస్థాయిలో అన్ని విద్యాసంస్థలు, జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

Updated Date - 2022-08-16T09:51:21+05:30 IST