సొంతూరు వెళ్లేదెలా?

ABN , First Publish Date - 2022-09-30T08:30:42+05:30 IST

సొంతూరిలో దసరా వేడుకలు జరుపుకోవాలనే కుతూహలంతో హైదరాబాద్‌ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన కుటుంబాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్‌ దొరకడం లేదు.

సొంతూరు వెళ్లేదెలా?

  • పండగకు ఆర్టీసీ బస్సుల కొరత.. రైళ్లు ఫుల్‌
  • ‘ప్రైవేటు’లో భారీ చార్జీలు.. ఫ్లైట్‌ టికెట్లకూ రెక్కలు
  • దసరాకు వారం ముందే కలిసొచ్చిన సెలవులు
  • హైదరాబాద్‌ నుంచి లక్షలాదిగా సొంతూళ్లకు
  • టీఎస్‌ఆర్టీసీ 4,198, ఏపీఎస్‌ఆర్టీసీ 1,090 
  • స్పెషల్‌ బస్సులు.. అయినా దొరకని టికెట్లు

హైదరాబాద్‌, సెస్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సొంతూరిలో దసరా వేడుకలు జరుపుకోవాలనే కుతూహలంతో హైదరాబాద్‌ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన కుటుంబాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్‌ దొరకడం లేదు. రైళ్లలో తత్కాల్‌ సీట్లు సైతం లభ్యం కాకపోవడంతో ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు. పండుగ డిమాండ్‌ను ఆసరా చేసుకుని ప్రైవేట్‌ బస్సుల ఆపరేటర్‌లు అమాంతం రెండు, మూడు రెట్లు చార్జీలు పెంచేశారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లే విమానాల్లో సైతం టికెట్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఆర్టీసీ పండుగ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేసేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యంతరాలతో ఇప్పుడు సాధారణ చార్జీలతో బస్సులు నడుపుతోంది. ప్రతి రోజూ ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చే సాధారణ బస్సులకు తోడుగా టీఎ్‌సఆర్టీసీ పండుగ కోసం 4,198 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అలాగే ఎపీఎ్‌సఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి 1,090 ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ ఈ బస్సుల్లో సీట్లు దొరకపోవడంతో ప్రయాణికులు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్‌ బస్సుల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి రోజూ సాధారణంగా హైదరాబాద్‌ నుంచి కర్ణాటక-బెంగుళూరు ప్రాంతాలకు 200కు పైగా, మహారాష్ట్ర-ముంబై ప్రాంతాలకు మరో 200లకు పైగా ప్రైవేట్‌ బస్సులు వెళ్లి వస్తుంటాయి. 


ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కేంద్రాలు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు 1,200 బస్సులు ప్రయాణికులను తీసుకుని వెళ్లి వస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా టూరిస్టు బస్సులను సైతం ప్రయాణికుల కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే సీట్ల రిజర్వేషన్లు పూర్తి కావడంతో ప్రైవేట్‌ ఆపరేటర్లు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి అదనపు బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండ వరంగల్‌ జిల్లా కేంద్రాలు, పరిసర గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు రప్పిస్తున్నట్టు ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ పురుషోత్తం నాయక్‌ తెలిపారు. 


దసరాకు నగరం సగం ఖాళీ!

దసరా పండుగకు వారం రోజుల ముందు నుంచే సెలవులు రావడంతో లక్షలాది కుటుంబాలు సొంతూళ్లకు, తీర్థయాత్రలకు బయలుదేరి వెళుతున్నాయి. దీంతో హదరాబాద్‌ నగరం సగానికి సగం ఖాళీ కానున్నది. ఇప్పటికే నగర రహదారులపై వాహనాల సంఖ్య తగ్గిపోయింది. ట్రాఫిక్‌ రద్దీ కన్పించడం లేదు. కానీ, ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వెళ్లే బస్సులు, ప్రైవేట్‌ వాహనాల సంఖ్య భారీగా పెరిగింది.

Read more