అంటువ్యాధులపై ఇంటింటా సర్వే

ABN , First Publish Date - 2022-07-18T08:42:51+05:30 IST

రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక అంటువ్యాధుల తీవ్రత మొదలైంది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా

అంటువ్యాధులపై ఇంటింటా సర్వే

వాంతులు, విరోచనాలు, జ్వరం బాధితుల వివరాల సేకరణ

సర్వే చేస్తోన్న మున్సిపల్‌, పంచాయతీ సిబ్బంది

ప్రతి 8 ఇళ్లలో ఒక చోట దోమల లార్వాల గుర్తింపు

ప్రతి ఆశా కార్యకర్తకు 30 ఇళ్లు కేటాయింపు

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన బాధితుల నమోదు


హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక అంటువ్యాధుల తీవ్రత మొదలైంది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా సర్వేకు ఆదేశించింది. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఈ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలను జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇంటింటా సర్వే మొదలైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారి వెల్లడించారు. బాధితులకు జ్వరం, వాంతులు, విరోచనాలున్నాయా లేదా అన్నదానిపైనే ప్రధానంగా సర్వే చేస్తున్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు సిబ్బంది ఉంటున్నారు. అందులో ఇద్దరు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది; ఒకరు మునిసిపాలిటీ (పట్టణాల్లో అయితే) లేదా పంచాయతీరాజ్‌ (గ్రామాల్లో) సిబ్బంది ఉంటున్నారు. ఇందులో వైద్య సిబ్బంది హెల్త్‌ స్టేటస్‌ చూస్తుండగా... మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది పరిసరాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తున్నారు.


కాగా... గ్రామాల్లో ప్రతి ఆశా కార్యకర్తకు 30 ఇళ్లు కేటాయించారు. వారికి సర్వే ఫార్మాట్‌ ఇచ్చారు. అందులో టీమ్‌ మెంబరు పేరు, సెల్‌ నంబరు, ఊరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి, యూపీహెచ్‌సీ పరిధి, విజిట్‌ చేసిన తేదీ, ఇంటి నంబరు, రోగి పేరు, వయసు, స్త్రీ / పురుషుడు, చిరునామా, జ్వరం, ఇతర లక్షణాలు, ఆస్పత్రి పాలయ్యారా లేదా? ఒకవేళ ఆస్పత్రిలో చేరితే దాని చిరునామా తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాలను ఏ రోజుకారోజు జిల్లా డీఎంహెచ్‌వోలకు పంపిస్తున్నారు. వీటితోపాటు ఏఎన్‌ఎం ఆధ్వర్యంలో... అన్ని ఇళ్లల్లో నీటి నిల్వలను చెక్‌ చేస్తూ దోమల లార్వాలను పరిశీలిస్తున్నారు. అంతేగాక వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేలో బాధితులకు టైఫాయిడ్‌, డెంగీ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఓ జిల్లా వైద్యాధికారి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ముఖ్యంగా వాంతులు, విరోచనాలు, జర్వం, జలుబు వంటి వాటితో బాధపడేవారే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.


ఇంటింటి సర్వేలో భాగంగా దోమల లార్వా నిల్వలపై కూడా సర్వే చేస్తున్నారు. ఈ మేరకు వర్షాల తర్వాత ఆవాసాల మధ్య నీటి నిల్వల్లో దోమల లార్వాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో ప్రతీ 8 ఇళ్లలో ఒక చోట దోమల లార్వా నిల్వలున్నట్లు గుర్తించారు. దీనివల్ల మున్ముందు డెంగీ కేసులు ప్రమాదకర స్థాయిలో వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1250కిపైగా డెంగీ పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇక దోమల లార్వాలున్న చోట యాంటీ లార్వా ఆపరేషన్‌ చేస్తున్నారు. 


అందుబాటులో మందులు 

అంటువ్యాధుల నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యశాఖ... ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం, వాంతులు, విరోచనాలు, మలేరియా, డెంగీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకున్నట్లు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పారాసిటమాల్‌, యాంటీబయోటిక్స్‌లో... సిఫ్రాఫ్లాక్సిన్‌, టాక్జిమోఅమెక్సిలిన్‌, మెట్రోనైడోజోల్‌, వొమికైండ్‌, జింక్‌, ఓఆర్‌ఎ్‌సతోపాటు క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్స్‌ను అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచారు. 

Updated Date - 2022-07-18T08:42:51+05:30 IST