Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షాలపై తాజా అప్‌డేట్ ఇదే.. పరిస్థితి ఎలా ఉండబోతోందంటే..

ABN , First Publish Date - 2022-07-12T20:33:36+05:30 IST

భాగ్యనగరాన్ని ముసురు కమ్మేసింది. మరో 10 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, బలమైన గాలులతో..

Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షాలపై తాజా అప్‌డేట్ ఇదే.. పరిస్థితి ఎలా ఉండబోతోందంటే..

హైదరాబాద్: భాగ్యనగరాన్ని ముసురు కమ్మేసింది. మరో 10 గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, బలమైన గాలులతో వర్షం కురుస్తుందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. చెట్లు విరిగిపడే అవకాశం ఉందని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ కోసం DRF టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈనెల 8 నుంచి గ్రేటర్‌లో వర్షం పడుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు పడినప్పటికీ.. సాయంత్రం 5 గంటల తర్వాత మోస్తరు వర్షం పడింది. పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. గచ్చిబౌలి, టోలీచౌకి, మెహిదీపట్నం, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌సిటీతోపాటు ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సికింద్రాబాద్‌ వైపున ఉన్న ట్యాంక్‌బండ్‌పై అరగంటకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయినట్లు వాహనదారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో వివిధ మార్గాల్లో నడిచిన రైళ్లు కిటకిటలాడాయి.కాప్రాలో అత్యధికంగా 16.8 మిల్లీమీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 16 మిల్లీమీటర్లు, షాపూర్‌నగర్‌లో 14.8, జీడిమెట్లలో 14.3, కుషాయిగూడలో 13.8, గాజుల రామారం, నేరేడ్‌మెట్‌లో 13.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2021 జూలై గణాంకాలతో పోల్చితే ఇప్పటికే మూడు జిల్లాల్లో 35 శాతానికి పైగా వర్షపాతం నమోదైనట్లు బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసిందని వెల్లడించారు. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశామని, ప్రజలు అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు.

Read more