హలో హోంమంత్రిగారూ.. బిర్యానీ కావాలి!

ABN , First Publish Date - 2022-09-30T08:15:50+05:30 IST

సమయం అర్ధరాత్రి 12 గంటలు! హోంమంత్రి మహమూద్‌ అలీ సెల్‌ఫోన్‌ మోగింది.

హలో హోంమంత్రిగారూ.. బిర్యానీ కావాలి!

  • హోటళ్లు ఎప్పటిదాకా తెరిచి ఉంటాయ్‌? 
  • అర్ధరాత్రి పాతబస్తీ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ 
  • రాత్రి 12 దాకా ఉంటాయని చెప్పిన అలీ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): సమయం అర్ధరాత్రి 12 గంటలు! హోంమంత్రి మహమూద్‌ అలీ సెల్‌ఫోన్‌ మోగింది. ఆ సమయంలో ఫోన్‌ రావడంతో ఏదో సీరియస్‌ విషయమే అయివుంటుందని లిఫ్ట్‌ చేసిన మంత్రి.. ఆవలి వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఒకింత షాక్‌ అయ్యారు. ‘బిర్యానీ తినాలి.. హోటళ్లు ఎప్పటిదాకా తెరిచి ఉంటాయో చెప్పండి?’ అని మంత్రిని అడిగాడు. తాను హోంమంత్రిని అని, ఎన్నో విషయాల్లో తల మునకలై ఉంటానని, అర్ధరాత్రి ఫోన్‌ చేసి బిర్యానీ గురించి అడగటం ఏమిటి? అని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా బిర్యానీ తినాలనిపించి పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి, మంత్రిగారికే ఫోన్‌ చేశాడు. తొలుత మహమూద్‌ అలీ కొంత అసహనం వ్యక్తం చేసినా ఓర్పుగా సమాధానమిచ్చారు. ‘రాత్రి 12 గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంటాయి. వెళ్లి తిను’ అని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో హోటళ్లు ఎప్పటిదాకా తెరిచి ఉంటాయాన్న విషయంలో ఇటీవల కొంత గందరగోళం నెలకొంది. ఈ విషయమ్మీద గతవారం హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ను మజ్లిస్‌ నేతలు కలిశారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకూ హోటళ్లు తెరిచివుంచేలా అనుమతివ్వాలని కోరారు. రాత్రి 12గంటలవరకు అనుమతి ఉంది కదా అని సీపీ వారితో అన్నారు. అయితే హోటళ్లు ఎప్పటిదాకా తెరిచి ఉంటాయనే విషయమ్మీద స్పష్టత లేకుండానే కొందరు రాత్రి ఒంటిగంట దాకా అనుమతి ఉంటుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో హోటళ్ల సమయమ్మీద పోలీసులు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు వస్తున్నాయి.

Read more