నేడు, రేపు భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-10-11T09:06:02+05:30 IST

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నేడు, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌లో వాన.. ట్రాఫిక్‌ ఇక్కట్లు  

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం 12 జిల్లాల్లో ఏడు సెంటీమీటర్లకు పైగా భారీ వర్షా లు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలున్నాయి. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలోనూ మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని వరుణుడు వీడడం లేదు. వారం రోజులుగా ప్రతాపం చూపిస్తున్న వర్షాలు.. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు నానా ఇక్కట్లు పడ్డారు. తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ విదర్భ మీదుగా పశ్చిమ మధ్య ప్రదేశ్‌ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో మూడు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. నాంపల్లిలో గరిష్ఠంగా 16.3, అత్యల్పంగా జూబ్లీహిల్స్‌లో 10.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక, వికారాబాద్‌ జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షానికి తాండూరు-హైదరాబాద్‌ రహదారిపై రాకపోకలు నిల్చిపోయాయి. అనేక చోట్ల ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. 

  

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద 

మరోవైపు, ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో మూడు గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌కు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 12 గేట్లను ఎత్తి 1.47 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇక, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు 35,240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 


ఆవర్తనాల ప్రభావంతోనే.. 

నైరుతి రుతుపవనాల తిరోగమన సమయంలో దేశాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈనెల 15కల్లా నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాలి. ఆ తర్వాతే బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు దక్షిణాది వైపుగా వీచి వర్షాలు కురవాలి. అయితే ఈనెల ప్రారంభం నుంచే తూర్పుగాలులు వీస్తుండడంతో వాతావరణ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అక్టోబరు తొలి వారంలో అల్పపీడనాలు ఏర్పడవు. అలాంటిది ఈ నెల తొలి వారంలో అల్పపీడనం ఏర్పడి ఐదో తేదీ వరకు కొనసాగింది. ఆ తరువాత తూర్పు మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు, దీనికితోడు ఉత్తరాది వరకు ద్రోణులు కొనసాగడంతో దక్షిణ భారతం నుంచి ఉత్తరాది వరకు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి.  వచ్చే నాలుగైదు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడనున్నదని మోడల్స్‌ చెబుతున్నాయి. వీటి ప్రభావంతో మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో కొనసాగుతున్న లానినా ప్రభావంతోనే తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయని అంచనా వేశారు. 

Read more