ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-09-08T08:26:13+05:30 IST

అనేక ప్రాంతాల్లో రహదారులు వరద నీటి ముంపులో చిక్కుకుపోవడంతో వాహనాల రాకపోకలుకు గంటల కొద్దీ అంతరాయం కలిగింది.

ముంచెత్తిన వాన

  • హైదరాబాద్‌లో మళ్లీ మునిగిన మూసారాంబాగ్‌ బ్రిడ్జి.. పలు చోట్ల గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌
  • మచ్చబొల్లారంలో 9 సెం.మీ. వర్షం.. రంగారెడ్డిలోనూ భారీ వర్షాలు.. యాచారంలో 10 సెం.మీ. 
  • పిడుగులు పడి ముగ్గురి మృతి.. వాగులో లెక్చరర్‌ గల్లంతు.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వనపర్తిల్లో ఘటనలు
  • 3 రోజులు అతి భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌.. ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద
  • గోదావరి వరదకు పగ్గాలు.. భద్రాచలం వెంట కరకట్టలు, రక్షణ చర్యలు.. 1000 కోట్ల కేటాయింపు!
  • రంగంలోకి సీఎం కార్యాలయం.. సమీక్షించిన సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : అనేక ప్రాంతాల్లో రహదారులు వరద నీటి ముంపులో చిక్కుకుపోవడంతో వాహనాల రాకపోకలుకు గంటల కొద్దీ అంతరాయం కలిగింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి వరద పొంగి ప్రవహించింది. దీంతో బ్రిడ్జిపై వెళ్లేందుకు వాహనదారులు వణికిపోయారు. ఎల్‌బీనగర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. అల్వాల్‌ మచ్చాబొల్లారంలో 9.0 సెం.మీ, ఎల్‌బీనగర్‌లో 7.8 సెం.మీ వర్షం కురిసింది. రాఘవేంద్రకాలనీ, సుచిత్ర సెంటర్‌, చింతల్‌ మార్కెట్‌ కాకతీయనగర్‌ ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. ఎల్‌బీనగర్‌, నల్లగొండ చౌరస్తా నుంచి చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వరకు సుమారు గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఓ వైపు భారీవర్షం, మరో వైపు ఖైరతాబాద్‌ మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఖైరతాబాద్‌, లకిడీకాపూల్‌, ఎన్టీఆర్‌మార్గ్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది.


 రంగారెడ్డి జిల్లా యాచారంలో 10 సెం.మీ., మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌లో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, ఆసిఫాబాద్‌ జిల్లా పార్దిగ్రామంలో మాయబాయి (38), మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేటలో సత్తయ్య (45), నిజామాబాద్‌ జిల్లా ఇత్వార్‌పేటలో సయ్యద్‌ గౌసొద్దీన్‌ (35)లు బుధవారం పిడుగులు పడి మృతి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ సాత్నాల డ్యాంలో జారిపడి విద్యార్థిని ప్రియాంక (15) మృతి చెందగా, మరో విద్యార్థిని ప్రీతిని స్థానికు లు రక్షించి, ఆస్పత్రికి తరలించారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల పరిధిలోని ఊకచెట్టు వాగు దాటుతుండగా జారి పడి ఆత్మకూర్‌కు చెందిన ప్రైవేటు లెక్చరర్‌ ఆకుల కురుమూర్తి గల్లంతయ్యారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిశివారులోని మంజీర నది వరద ఉధృతిలో ఇద్దరు గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 


నిండుగా శ్రీశైలం, సాగార్జున సాగర్‌

ఎగువున కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం శ్రీశైలానికి 1.58 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 214.36 టీఎంసీలు నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌కు 1.18 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 8 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 589.40 అడుగులుగా ఉంది. 


24 గంటల్లో అల్పపీడనం

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక,  రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Read more