పెళ్లి పందిరిలో విషాదహేల

ABN , First Publish Date - 2022-04-24T06:08:06+05:30 IST

పెళ్లి పందిరిలో విషాదహేల

పెళ్లి పందిరిలో విషాదహేల
గుండెపోటుతో మృతిచెందిన వెంకట్రాంనర్సయ్య

మట్టెవాడ(వరంగల్‌), ఏప్రిల్‌ 23: పెళ్లి మండ పమంతా బంధువులతో కళకళలాడుతోంది.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురి పెళ్లి వేడుకలో ఆ తండ్రి ఆనందంగా కన్యదానం చేశాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు.  ఈ విషాదకర సంఘటన శనివారం వరంగల్‌ నగరంలో చోటుచేసుకుంది.  కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్‌ వేణురావు కాలనీకి చెందిన బొరిగం వెంకట్రాంనర్సయ్య((63) వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని ఓ బైక్‌ షో రూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వెంకట్రాంనర్సయ్య- కళావతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వేణురావుకాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. చిన్నకూతురు శిరీషను శంభునిపేటకు చెందిన వంశీకృష్ణతో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు శనివారం వరంగల్‌ చౌర్‌బౌళిలోని పద్మశాలి ఫంక్షన్‌హాల్‌లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. నర్సయ్య దంపతులు కూతురు కన్యదానం చేశారు. అనంతరం వధూవరులు, కుటుంబ సభ్యులతో నర్సయ్య గ్రూపు ఫొటో దిగాడు. ఈ క్రమంలో కాసేపటికే మండపంలో గుండెపోటుతో నర్సయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, వివాహానికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. నర్సయ్య మృతదేహాన్ని వేణురావు కాలనీకి తరలించారు. అప్పటి వరకు కళకళలాడిన పెళ్లిమండపంలో క్షణాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి అనంతరం మండపం నుంచే వధువును వరుడి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పసుపు బట్టలు మార్చాక, అనంతరం తండ్రి కడసారి చూపు కోసం తీసుకొచ్చి, కొద్దిసేపటి తర్వాత తీసుకెళ్లారు. రాత్రి నర్సయ్య అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటికలో నిర్వహించారు. 

Read more