అప్పు తీర్చమన్నందుకు చంపేశాడు

ABN , First Publish Date - 2022-12-12T04:05:14+05:30 IST

అవసరానికి అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించమని అడగటమే ఓ యువకుడి పాలిట మరణ శాసనమైంది. ఆ యువకుని వద్ద అప్పు చేసిన ఓ 20 ఏళ్ల యువకుడు డబ్బు చెల్లించలేక మరికొందరితో కలిసి అతన్ని అతి కిరాతకంగా హత్య చేశాడు.

అప్పు తీర్చమన్నందుకు చంపేశాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువకుడి దారుణ హత్య

బాకీ తీర్చలేక ప్రాణం తీసిన వైనం

మరికొందరితో కలిసి 20 ఏళ్ల కుర్రాడి ఘాతుకం

టేకులపల్లి, డిసెంబరు 11: అవసరానికి అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించమని అడగటమే ఓ యువకుడి పాలిట మరణ శాసనమైంది. ఆ యువకుని వద్ద అప్పు చేసిన ఓ 20 ఏళ్ల యువకుడు డబ్బు చెల్లించలేక మరికొందరితో కలిసి అతన్ని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ హత్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. మండలంలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు పంచాయతీ శాంతినగర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు బాదావతు బాలాజీ కొడుకు బాదావతు అశోక్‌(27) ఖమ్మం ఐటీ హబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌కు గత ఏడాదే వివాహమవ్వగా.. భార్య, రెండు నెలల కూతురు ఉన్నారు. ఐటీ ఉద్యోగైన అశోక్‌ గ్రామంలో కొందరికి వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో హోటల్‌ నిర్వాహకుడు గుగులోతు గోవిందు కొడుకు ప్రేమ్‌కుమార్‌ అలియాస్‌ కిట్టు(20)కి కూడా కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని ప్రేమ్‌పై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడు. హోటల్‌ పనుల్లో తండ్రికి సాయంగా ఉండే ప్రేమ్‌ అప్పు చెల్లించే స్థితిలో లేడు. కానీ అశోక్‌ నుంచి ఒత్తిడి అధికమవ్వడంతో అతని అడ్డుతొలగిస్తే రుణ విముక్తి లభిస్తుందనే భావనతో ప్లాన్‌ వేశాడు.

ఇందులో భాగంగా శనివారం రాత్రి అశోక్‌కు ఫోన్‌ చేసి డబ్బిస్తానని నమ్మించి బయటికి పిలిచాడు. దీంతో ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డుకు వెళ్లొస్తానని రాత్రి వేళ ఇంటి నుంచి వెళ్లిన అశోక్‌ తెల్లవారినా తిరిగిరాలేదు. అతని సెల్‌ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటంతో ఆదివారం ఉదయం పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు ప్రేమ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ప్రేమ్‌ను విచారించగా మరికొందరితో కలిసి అశోక్‌ను తానే హత్య చేశానని వెల్లడించాడు. మృతదేహాన్ని ముత్యాలంపాడుక్రా్‌సరోడ్డు పాఠశాల ఆవరణలో గోడ పక్కన పడేశామని చెప్పాడు. అక్కడకి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. అశోక్‌ గొంతు, మణికట్లు, కాలుపై పదునైన ఆయుధంతో కోసిన నిందితులు.. మొహంపై బండరాయితో మోది చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన టేకులపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రేమ్‌కుమార్‌ అయ్యప్ప మాలలో ఉన్నాడని, హత్యలో మరో నలుగురు అతనికి సహకరించారని సమాచారం.

Updated Date - 2022-12-12T04:05:14+05:30 IST

Read more