గురుకుల విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-25T09:12:00+05:30 IST

గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

గురుకుల విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు:మంత్రి గంగుల

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పిల్లలకు మెరుగైన చదువుతోపాటు ఆరోగ్యాన్ని అందిస్తే వారు పది కాలాలపాటు గుర్తుంచుకుంటారని చెప్పారు. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, హాస్టల్‌ వార్డెన్లు, జిల్లా సంక్షేమ అధికారులతో గంగుల శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 19 బీసీ గురుకులాలు ఉంటే ఆ సంఖ్య 310కి పెంచి 1,65,400 మంది బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. 413 ప్రీమెట్రిక్‌ హాస్టళ్లు, 287 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో 57,783 మంది చదువుకుంటున్నారని తెలిపారు. అక్టోబరులో కొత్తగా 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. 

Read more