వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌!

ABN , First Publish Date - 2022-09-13T08:46:56+05:30 IST

యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మార్గం సుగమమయ్యే అవకాశం కనిపిస్తోంది.

వర్సిటీల్లో  పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌!

ఉమ్మడి బోర్డుకే అధికారాలు.. వర్సిటీగా సిద్దిపేట అటవీ కళాశాల

వాహనాల ‘జీవిత పన్ను’లో అవకతవకలకు కళ్లెం

శాసనసభలో 7 బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మార్గం సుగమమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి నియామక బోర్డుకు అధికారాలు అప్పగించేందుకు వీలుగా యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంతోపాటు తెలంగాణ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయీస్‌ బిల్లును మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ ఫారెస్ట్‌ యూనివర్సిటీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ మోటార్‌ వెహికల్‌ ట్యాక్సేషన్‌ సవరణ బిల్లును మంత్రి పువ్వాడ అజయ్‌, తెలంగాణ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సవరణ బిల్లును సీఎం కేసీఆర్‌ తరపున మంత్రి తలసాని సభలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు ద్వారా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వీలు పడనుంది. 


రాష్ట్రంలో తొలి అటవీ విశ్వవిద్యాలయం

వైద్య విద్యలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పదవీ విరమణ వయస్సును సవరించే బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. వైద్యవిద్యలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచగా.. డీఎంఈ, ఏడీఎంఈలుగా కొనసాగేందుకు 61 ఏళ్ల వరకే  అర్హత ఉంది. దీంతో చాలామంది ప్రొఫెసర్లు పదోన్నతి తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాజా బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అలాగే, రాష్ట్రంలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం లభిస్తే.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థ.. త్వరలోనే ఫారెస్ట్‌ యూనివర్సిటీగా మారనుంది. 


అజామాబాద్‌ భూముల క్రమబద్ధీకరణ

హైదరాబాద్‌లోని అజామాబాద్‌ పారిశ్రామిక వాడ భూముల్లో లీజుకు తీసుకొని చట్టబద్ధంగా ఉంటున్నవారితో పాటు అక్రమంగా ఉంటున్నవారికి మార్కెట్‌ విలువ ఆధారంగా హక్కులు దఖలు పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత(కౌలులు-లీజుల) సవరణ బిల్లు-2022ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. లీజుదారులకు 100శాతం మార్కెట్‌ విలువతో, ఇతరులకు 200శాతం మార్కెట్‌ విలువతో క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయిస్తూ బిల్లును ప్రతిపాదించింది. ఈ లెక్కన లీజుదారులకు గజం రూ.38వేల చొప్పున, ఇతరులకు గజం రూ.76వేల చొప్పున క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, మోటారు వాహనాల జీవిత పన్ను చెల్లింపుల్లో అవకతవకలను అరికట్టేందుకు 1963ఎంవీ యాక్ట్‌ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వాహనాలపై జీవితపన్నును తగ్గించుకునేందుకు ఖరీదు ఎక్కువైనప్పటికీ తక్కువ ధరతో ఇన్‌వాయి్‌సలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు సభలో సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా, తెలంగాణ పురపాలిక చట్టం 2019లోని 5 (4)ను సవరించి.. కో ఆప్షన్‌ సభ్యులను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం జీహెచ్‌ఎంసీలోని ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్య 15కు చేరనుంది. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లలో ప్రస్తుతం ఉన్న అయిదుగురు కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్య 10 కానుంది. కో ఆప్షన్‌ సభ్యుల పెంపు అంశంతోపాటు ములుగు గ్రామ పంచాయతీని మునిసిపాలిటీగా అప్‌ గ్రేడ్‌ చేయాలన్న ప్రతిపాదనకు సంబంధించిన బిల్లును కేటీఆర్‌ ప్రవేశపెట్టారు.

Read more