‘గ్రేటర్‌’ బడ్జెట్‌ రూ.609 కోట్లు

ABN , First Publish Date - 2022-02-23T05:48:04+05:30 IST

గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.609.47కోట్లతో రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.559.77 కోట్లుకాగా, ఈ బడ్జెట్‌లో రూ.49.7కోట్ల అంచనాలు పెరిగాయి.

‘గ్రేటర్‌’ బడ్జెట్‌ రూ.609 కోట్లు

సొంత ఆదాయం రూ.197.52 కోట్లు
గ్రాంట్ల అంచనా రూ.408.95 కోట్లు
పారిశుధ్య నిర్వహణకు రూ.21.93 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.80కోట్లు
బడ్జెట్‌ లెక్కలపై విపక్షాల అసంతృప్తి
వాకౌట్‌ చేసిన బీజేపీ, ఎండగట్టిన కాంగ్రెస్‌
ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ ప్రమాణం
హాజరైన వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), ఫిబ్రవరి 22 : గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.609.47కోట్లతో  రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.559.77 కోట్లుకాగా, ఈ బడ్జెట్‌లో రూ.49.7కోట్ల అంచనాలు పెరిగాయి. మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన మంగళవారం హనుమకొండలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో బడ్జెట్‌ సమావేశం జరిగింది. ఆరంభానికి ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్‌ మహమూద్‌, మేడారం జాతరలో మరణించిన పారిశుధ్య కార్మికుడు పొగుల చక్రపాణికి సభ్యులు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.

సమావేశంలో అంచనాలతో కూడిన ముసాయిదా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జూనియర్‌ అక్సౌంట్‌ ఆఫీసర్‌ సరిత బడ్జెట్‌ లెక్కలు వివరించారు.  అధికార పక్ష  సభ్యులు బడ్జెట్‌ ఏకగ్రీవ ఆమోదం తెలుపగా,  బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు పెదవి విరిచారు. చీకటి బడ్జెట్‌గా బీజేపీ కార్పొరేటర్లు అభివర్ణిస్తూ వాకౌట్‌ చేశారు. కాంగ్రెస్‌ కార్పొరేటర్లు కాకి లెక్కల బడ్జెట్‌గా విమర్శించారు. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరం బల్దియా బడ్జెట్‌ అంగీకారం, నిరసనల మధ్య ఆమోద ముద్ర పొందింది.

రూ.609.47 కోట్ల జీడబ్ల్యూఎంసీ పద్దులో బల్దియాకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలతో పాటు వ్యయం, బ్యాలెన్స్‌ బడ్జెట్‌ తదితర వాటిని సొంత ఆదాయ వనరులుగా రూ.197.52 కోట్లు లెక్కలు కట్టారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే నాన్‌ ప్లాన్‌ గ్రాంట్లు రూ.320 కోట్లు, ప్లాన్‌ గ్రాంట్ల రూంలో రూ.87 కోట్లు, ఇతర గ్రాంట్లు రూ. 19.5 కోట్లు సమకూరుతాయనే అంచనాలతో  మొత్తంగా రూ.408.95 కోట్లు గ్రాంట్లుగా పద్దును రూపకల్పన చేశారు. సొంత ఆదాయ వనరులలో పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా రూ.19.75 కోట్లు చూపారు. ఇక బ్యాలెన్స్‌ బడ్జెట్‌లో రూ.12.80 కోట్లు డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారు. సొంత ఆదాయంలో మూడవ వంతు నిధులు రూ.8.80 కోట్లు విలీన గ్రామాలు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కేటాయింపుగా చూపారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాశ్‌ జీడబ్ల్యూఎంసీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం  చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు ఖరీదైన సెల్‌ఫోన్లను అందచేశారు. 2022 డైరీతో పాటు గుర్తింపు కార్డులను అందచేశారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కమిషనర్‌ ప్రావీణ్య పాల్గొన్నారు.

సొంత ఆదాయం రూ.197.52 కోట్లు
2022-23 బడ్జెట్‌లో సొంత ఆదాయ వనరులు రూ.197.52 కోట్లుగా పొందు పరిచారు. గత యేడాది రూ.183.52 కోట్లు ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సొంత ఆదాయం రూ.14 కోట్లు పెంపు అంచనాలు చూపారు. సొంత ఆదాయ వనరులలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పన్నులు రూ.81.60 కోట్లు, అద్దెలు, ఫీజుల రూపంలో రూ.13.26 కోట్లు, ట్రేడ్‌ లైసెన్స్‌ ఇతర మార్గాల్లో రూ.17.33 కోట్ల ఆదాయం, భవన నిర్మాణ అనుమతులు, టౌన్‌ ప్లానింగ్‌ సేవల ద్వారా రూ.63.12 కోట్లు, నీటి సరఫరా ఇతర మార్గాల్లో ఇంజినీరింగ్‌ విభాగం నుంచి లభించే ఆదాయ వనరులు రూ.22.22 కోట్లుగా లెక్కలు కట్టారు. మొత్తంగా రూ.197.52 కోట్లు జీడబ్ల్యూఎంసీ సొంత ఆదాయ వనరులుగా చూపుతూ పద్దును ప్రవేశపెట్టారు.

బల్దియా పద్దులో రూ.408.95 కోట్లు గ్రాంట్ల రూపంలో సమకూరుతాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వంనుంచి రూ.35.66కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.373.29కోట్ల నిధు లు అందుతాయనే అంచనాలు వేశారు. డిపాజిట్లు, అడ్వాన్స్‌ల రూపంలో రూ.3కోట్లు లెక్కలు కట్టారు. మొత్తంగా సొంత ఆదాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే గ్రాంట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూపంలో మొత్తంగా రూ.609.47 కోట్ల పద్దును రూపొందించారు.

గ్రీన్‌ బడ్జెట్‌ రూ.19.75 కోట్లు
బల్దియా బడ్జెట్‌లో పది శాతం గ్రీన్‌బడ్జెట్‌గా కేటాయింపు లు ఉండాలనే నిబంధనకు అనుగుణంగా రూ.19.75కోట్లు పొందుపరిచారు. గత ఆర్థిక సంవత్సరం గ్రీన్‌ బడ్జెట్‌ రూ.18.35 కోట్లు కాగా, ఈసారి రూ.1.40 కోట్ల అంచనాలు గ్రీన్‌ బడ్జెట్‌లో పెరిగాయి. ఇక సొంత ఆదాయ వనరుల నుం చి నిర్వహించే వ్యయంలో ఉద్యోగుల వేతనాలకు రూ.65కోట్లు, పారిశుధ్య నిర్వహణకు రూ.21.93 కోట్లు, విద్యుత్‌ బిల్లులకు రూ.19.35 కోట్లుగా లెక్కలు చూపారు. ఇతర నిర్వహణలో ఇంజినీరింగ్‌, పారిపాలన, టౌన్‌ ప్లానింగ్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ విభాగాల ఖర్చులకు రూ.45.09 లెక్కలు కట్టారు.

డివిజన్లకు నిధుల కోత
గత ఆర్థిక సంవత్సరంలో సొంత ఆదాయ వనరుల ద్వారా బ్యాలెన్స్‌ బడ్జెట్‌లో డివిజన్ల అభివృద్ధి పనులకు రూ.14.74 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్‌లో మాత్రం డివిజన్ల అభివృద్ధికి రూ.12.80 కోట్ల మాత్రమే పొందుపరిచారు. రూ.1.94 కోట్లు ఈ బడ్జెట్‌లో తగ్గాయి. ఇక విలీన గ్రామాలు, స్లమ్‌ ఏరియాల అభివృద్ధికి రూ.8.80 కోట్లు కేటాయించారు. ఇక పార్కులు, ఆట స్థలాలు, ఓపెన్‌ స్పెసెస్‌, వైకుంఠధామాలు, పబ్లిక్‌ టాయిలెట్లు, సమీకృత మార్కెట్లు తదితర అభివృద్ధి పనులకు రూ.4.80 కోట్ల కేటాయించారు.

మీడియాకు నో ఎంట్రీ

బడ్జెట్‌ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. అంతే కాదు కనీసం ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని కూడా నిరాకరించారు. సమావేశ మందిరం వద్దకు రాకుండా పలుచోట్ల పోలీసులను మోహరించారు. సమావేశానికి అనుమతి లేదని ఈ మేరకు సీడీఎంఏ నుంచి సర్క్యూలర్‌ జారీ అయినట్టు అధికారులు తెలిపారు. అ యితే సర్క్యులర్‌ చూపమన్న మీడియా ప్రశ్నలకు ఇప్పు డు లేదని తరువాత చూపుతామంటూ అధికారులు బదులిచ్చారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ కలలు సాకారం చేద్దాం

- నన్నపునేని నరేందర్‌,  వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే  
హైదరాబాద్‌ తరహాలో వరంగల్‌ నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో సీఎం కేసీఆర్‌, మంత్రి  కేటీఆర్‌ ఉన్నారు. ఈ మేరకు ఆశించిన దాని కంటే అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. వారి కలలను సాకారం చేద్దాం. పన్నుల విధింపులో గందరగోళం నెలకొంది. మురికివాడల్లోని ఆస్తులకు రూ.25 లక్షల పన్నుల నోటీసులు వచ్చాయి. దీనిపై దృష్టి పెట్టాలి.

ప్రజలపై భారం మోపలేదు
గుండు సుధారాణి, మేయర్‌
ప్రజలపై ఎలాంటి భారం మోపలేదు. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యాలనే నిర్దేశించుకున్నాం. అంతేకానీ ప్రజలపై భారం మోపి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనే చేయలేదు. మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. సొంత ఆదాయ నిధులతో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే గ్రాంట్లు సమకూర్చుకొని నగర సమగ్రాభివృద్ధి సాధిస్తాం.

టీమ్‌ వర్కుతోనే అభివృద్ధి
- బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ
ప్రజాప్రతినిధులు, అధికారుల టీమ్‌ వర్క్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది.  దీనిని గుర్తించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలుతో పాటు మురికివాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

హరితహారం పకడ్బందీగా జరగాలి

- బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ  
సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కార్యక్రమం హరితహారం పకడ్బందీగా జరగాలి. ఈ కార్యక్రమానికి తన వంతుగా రూ.50 లక్షలు ఇస్తాను. ప్రధాన రహదారులతో పాటు డివిజన్లలో డ్రెయినేజీలు, రహదారుల నిర్మాణం వేగంగా జరగాలి. 1962 లే-అవుట్‌ స్థలాలను పరిరక్షించాలి. వాటిని క్రీడలు, గ్రంథాలయాల ఏర్పాటుకు కేటాయించాలి. ఆదాయ వనరుల పెంపు మార్గాలను అన్వేషించాలి

సమగ్ర క్రీడల సముదాయం ఇండోర్‌ స్టేడియం
- ప్రావీణ్య, కమిషనర్‌
బల్దియా కార్యాలయం వెనకగల ఇండోర్‌ స్టేడియాన్ని సమగ్ర క్రీడల సముదాయంగా అభివృద్ధి పరుస్తున్నాం. స్విమ్మింగ్‌ పూల్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌ కోర్డుల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. మునిసిపల్‌ స్థలాల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నాం.

వాస్తవాలకు దూరం : బీజేపీ
చీకటి బడ్జెట్‌గా బీజేపీ కార్పొరేటర్లు అభివర్ణిస్తూ నిరస న తెలిపారు. సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సం దర్భంగా కార్పొరేటర్లు చాడా స్వాతిరెడ్డి, చింతాకుల అ నిల్‌, రావుల కోమల, జలగం అనిత తదితరులు నల్ల కళ్లజోడు ధరించి నిరసన వ్యక్తం చేశారు.  

కాకి లెక్కలు చెప్పారు : కాంగ్రెస్‌
కాకి లెక్కల బడ్జెట్‌గా కాంగ్రెస్‌ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, శ్రీమాన్‌ విమర్శించారు. కేవలం అంకెలు మాత్రమే చూపుతున్నారని, నిధులు రావడం లేదన్నారు.





Updated Date - 2022-02-23T05:48:04+05:30 IST